యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించి ఓ సినిమా భారీ నష్టాలను చవి చూసింది. దీంతో ఆ నిర్మాత ఏకంగా నాలుగేండ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా ఆ విషయాన్ని పేర్కొని షాకిచ్చారు.

హీరోల కెరీర్‌లో సక్సెస్ లు, ఫెయిల్యూర్‌లు సహజం. కొన్ని భారీగా నష్టాలు తెప్పిస్తుంటాయి. చేదు జ్ఞాపకాలను మిగుల్చుతాయి. ఇక్కడ సక్సెస్‌ రేట్ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక్క హిట్‌ వచ్చినా హీరోల కెరీర్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కెరీర్‌లోనూ చాలా జయాపజయాలున్నాయి. తన కెరీర్‌లో చాలా బ్రేక్‌లు అందుకున్నారు. `స్టూడెంట్‌ నెంబర్‌ 1`, `ఆది`, `సింహాద్రి`, `యమదొంగ`, `అదుర్స్`, `బృందావనం`, `టెంపర్‌`, `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్‌`, `జై లవకుశ`, `అరవింద సమేత`, `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా ఎదిగారు. 

ఎన్టీఆర్‌ కెరీర్‌లో పదికిపైగా హిట్లు ఉంటే 18 ఫ్లాప్‌లున్నాయి. ఇందులో బిగ్గెస్ట్ ఫ్లాప్‌లో `శక్తి` ఒకటి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించారు. 2011లో ఫాంటసీ యాక్షన్‌ మూవీగా వచ్చిన ఈ సినిమా దారుణమైన పరాజయం చెందింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాతో తాను భారీగా నష్టపోయానని చెబుతున్నారు నిర్మాత అశ్వినీదత్‌. తన కెరీర్‌లోనే పెద్ద బ్యాక్‌ అని వెల్లడించారు. 

నిర్మాత అశ్వినీదత్‌ ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు.నంది అవార్డులపై ఆయన చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. ఏపీలో ఉత్తమ రౌడీలు, ఉత్తమ విలన్లకి అవార్డులిస్తారని ఎద్దేవా చేశారు. దీంతో ఏపీ అధికార పార్టీ నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో తిన్న అతిపెద్ద దెబ్బ గురించి బయటపెట్టారు. ఎన్టీఆర్‌ కారణంగా ఆయన ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందట. ఎన్టీఆర్‌ నటించిన `శక్తి` సినిమా అతిపెద్ద డిజప్పాయింట్‌మెంట్‌ అని తెలిపారు. 

ఆ రోజుల్లో నిర్మాతలే సినిమా పంపిణీ వ్యవహారాలు చూసుకునే వాళ్లట. సినిమా వల్ల నష్టం వస్తే నిర్మాతలు తట్టుకునే వారు కాదు. చాలా మంది అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు ఇళ్లు, పొలాలు అప్పుకున్న వాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. వారిని చూసినప్పుడు భయంగా ఉండేదట. దీంతో చాలా జాగ్రత్తగా సినిమాలు చేసేవాడినని తెలిపారు అశ్వనీదత్‌. ఈ క్రమంలోనే `శక్తి` సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత అసంతృప్తినిచ్చిన చిత్రమన్నారు. ``శక్తి` సినిమా విషయంలో బడ్జెట్ చేయిదాటిపోయింది. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు . అందువలన 32 కోట్ల నష్టం వచ్చింది. ఒక సినిమా వల్ల రూ. 32 కోట్లను పోగొట్టుకోవడమనేది మామూలు విషయం కాదు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది` అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ సినిమా కారణంగా అశ్వినీదత్‌ సుమారు నాలుగేళ్ల ఇండస్ట్రీకి దూరమైనట్టు చెప్పారు. నిజానికి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకున్నారట. అంతగా ఆ సినిమా దెబ్బ కొట్టిందన్నారు అశ్వినీదత్‌. అయితే పెద్ద హిట్‌ అయిన చిరంజీవి `చూడాలని ఉంది` చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తే అది రూ12కోట్లు నష్టం తెచ్చిందని, అందులో అల్లు అరవింద్‌ కూడా భాగస్వామి కావడంతో చెరో ఆరు కోట్ల నష్టపోయినట్టు చెప్పకొచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్‌ కారణంగా బడా నిర్మాత ఇండస్ట్రీని వదిలేయాలనుకోవడం బాధాకరం. 

అశ్వనీదత్‌ చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. `మహానటి`తో హిట్‌ని అందుకున్నారు. `జాతిరత్నాలు` వంటి చిన్న సినిమాలతోనూ సక్సెస్‌ అందుకున్నారు. దీంతోపాటు ఇప్పుడు `ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` అనే పాన్‌ ఇండియా మూవీని చేస్తున్నారు. ప్రభాస్‌కి జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. దీన్ని పార్ట్ లుగా తెరకెకెక్కించే అవకాశం ఉందట.