ప్రస్తుతం టాలీవుడ్ లో థ్రిల్లర్ జోనర్ చిత్రాలను మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో మేకర్స్ దృష్టి థ్రిల్లర్ సినిమాలపై పడింది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ లో 'అంధాదూన్' సినిమా విడుదలై పెద్ద సక్సెస్ అందుకుంది.

నేషనల్ అవార్డ్స్ కూడా దక్కించుకుంది. దీంతో చాలా మంది ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నారు. టాలీవుడ్ నుండి ఏకంగా నాలుగు బ్యాచ్ లు ఈ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నుండి అల్లు అరవింద్ ఈ హక్కుల కొనాలని చూస్తున్నారట.

ఎవరితో రీమేక్ చేయాలనుకుంటున్నారో తెలియాల్సివుంది. ఇటీవల 'రాక్షసుడు' సినిమాతో హిట్ అందుకున్న కోనేరు సత్యనారాయణ కూడా ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. నిర్మాత అభిషేక్ నామా ఇతడితో చేయి కలిపినట్లు తెలుస్తోంది. మరోపక్క సీనియర్ హీరో రవితేజ ఈ సినిమా రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. అందువల్ల ఆయన కూడా ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. 

వీరంతా ఇలా ఉంటే నైజాం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏషియన్ సునీల్, రామ్మోహన్ రావు కలిసి కూడా ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకి ఉన్న డిమాండ్ చూసిన హిందీ వెర్షన్ నిర్మాతలు భారీ అమౌంట్ అడుగుతున్నట్లు సమాచారం. హక్కుల కోసం మూడు కోట్లు అలానే లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.