ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు హీరో గోపీచంద్ క్రేజ్ బాగా తగ్గింది. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డాడు. దీంతో ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తోన్న సమయంలో నిర్మాత అనీల్ సుంకర సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు.

తమిళ దర్శకుడు తిరు రూపొందిస్తోన్న ఈ సినిమాలో గోపిచంద్ సరికొత్త అవతారంలో  కనిపించనున్నాడు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా బడ్జెట్ ముప్పై కోట్లు అనుకొని మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఆ బడ్జెట్ క్రాస్ చేస్తుందని సమాచారం.

పెద్ద కాస్టింగ్, విదేశాల్లో ఖరీదైన లొకేషన్లలో షూటింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ల కారణంగా బడ్జెట్ హద్దులు దాటేస్తుందని తెలుస్తోంది. పైగా వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ కావడంతో మొత్తంగా  రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందట. దీంతో నిర్మాత అనీల్ సుంకర టెన్షన్ పడుతున్నాడట.

14 రీల్స్ బ్యానర్ లో ఇలా ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి చాలా సార్లు లాస్ అయ్యారు. ఆ కారణంగానే అనీల్ సుంకర చిన్న బడ్జెట్ సినిమాలు తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు  గోపీచంద్ సినిమాకు ఖర్చు పెరిగిపోతుండడంతో ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా లేదా..? అనేది ప్రశ్నార్ధంగా మారిపోయింది.