‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్ డేట్స్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.  తాజాగా వచ్చిన అప్‌డేట్ మాత్రం అభిమానులను పీక్స్ కు తీసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్‌ యాక్షన్ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ కూడా సెట్లో కాలు పెట్టారు. ‘క్లైమాక్స్‌ గురించి ఎలాంటి అప్డేట్‌ రావడంలేదని భావిస్తున్న అభిమానుల కోసం ఒక అప్డేట్‌ ఇస్తున్నాం.. క్లైమాక్స్‌ కోసం పావెల్‌ వచ్చారు’ అంటూ చిత్ర టీమ్ ట్విటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ పేరుతో అభిమానులతో పంచుకుంది.

 సెట్స్ పై తనదైన శైలిలో నిక్ పావెల్ సూచనలు ఇస్తున్న వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్రబృందం విడుదల చేసింది. క్లైమాక్స్ చిత్రీకరణలో ఊపు లేదని మీరనుకుంటుండొచ్చు... ఇదిగో నిక్ పావెల్ వచ్చేశాడు అంటూ పేర్కొంది.

ఇక నిక్ పావెల్ గురించి చెప్పాలంటే...ఆయన కత్తియుద్ధంలో నిపుణుడు. నిక్ పావెల్ గతంలో బ్రిటన్ వూషూ టీమ్ తరపున యూరోపియన్ చాంపియన్ షిప్ లో పతకం గెలుచుకున్నాడు. అనేక యుద్ధ విద్యలను అధ్యయనం చేసిన అనుభవంతో హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్ గా సేవలు అందించాడు. బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్, మమ్మీ, ది లాస్ట్ సమురాయ్, సిండ్రెల్లా మ్యాన్ వంటి చిత్రాలకు పోరాట సన్నివేశాలు రూపకల్పన చేసి విమర్శలకు ప్రశంసలు అందుకున్నాడు. నిక్ పావెల్ బాలీవుడ్ లో మణికర్ణిక చిత్రానికి కూడా స్టంట్స్ కు రూపకల్పన చేశాడు.

   ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. 

అలాగే ఈ సినిమా మొత్తంలో పలు గెటప్స్‌లో కనిపిస్తారట ఇద్దరు హీరోలు. బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్‌ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని చెప్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్, బందిపోటు గెటప్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారట. మరికొన్ని గెటప్స్‌లోనూ ఎన్టీఆర్, చరణ్‌లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్‌ గెటప్స్‌ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయట.  

తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరిస్‌, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు జక్కన్న ఇప్పటికే ప్రకటించారు.