కరోనా ఎవరినీ వదలడం లేదు. వెండితెరపై హీరోయిజం పండించి ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించుకునే హీరోలను సైతం వెంటాడుతుంది. సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రత్యర్థులను మట్టికరిపించిన స్టార్స్ కూడా కరోనాకి తలొగ్గాల్సి వస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది కరోనాకి గురయ్యారు. ఇటీవల అమితాబ్‌ ఫ్యామిలీ కరోనాని జయించింది. అలాగే రాజమౌళి కుటుంబ కూడా కరోనా నుంచి బయటపడింది. 

ఇప్పుడు హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో డ్వేన్‌ జాన్సన్‌ కి కూడా కరోనా సోకింది. ఈ మహమ్మారి నుంచి ఆయన విజయవంతంగా కోలుకోవడం విశేషం. హాలీవుడ్‌ ఆడియెన్స్ `రాక్‌` అని పిలుచుకునే డ్వేన్‌ జాన్సన్‌ ఇటీవల కరోనాకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. తన కుటుంబం మొత్తానికి కరోనా సోకిందన్నారు. అయితే ఈ వైరస్‌ సోకిందనే వార్త తెలిసినప్పుడు షాక్‌కి గురయ్యాడట. మొదట కాస్త ఆందోళన చెందినా.. తర్వాత రిలాక్స్ అయ్యామన్నారు. 

ఇప్పుడు వైరస్‌ నుంచి బయటపడ్డామని తెలిపారు. తనతో సహా భార్య లారెన్‌ హషైన్‌, ఇద్దరు కూతుళ్ళు కరోనా నుంచి కోలుకున్నారని డ్వేన్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఓ వీడియోని షేర్‌ చేశారు. ఇందులో..ఫస్ట్ పిల్లలిద్దరికీ కొద్ది రోజుల పాటు గొంతు నొప్పి వచ్చిందని, ఇప్పుడు కరోనాను జయించి, ఎప్పటిలాగే ఆడుకుంటున్నారని తెలిపారు. ఈ వైరస్‌ రావడం వల్ల ఓ రకంగా తనకు ఆరోగ్యం మీద మరింత స్పృహ పెంచిందని, వైరస్‌ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. 

డ్వేన్‌ జాన్సన్‌ హాలీవుడ్‌లో `ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌‌` సిరీస్‌లో, `జుమాంజి` సిరీస్‌తోపాటు `హాబ్స్ అండ్‌ షా`, `రాంపేజ్‌`, `హెర్క్యూలస్‌`, `ది స్కార్పియన్‌ కింగ్‌`, `స్కై స్కాపర్‌` చిత్రాల్లో నటించారు. దీంతోపాటు డబ్ల్యూ డబ్ల్యూ ఈ రెజ్లర్‌గా పలుమార్లు ఛాంపియన్‌గానూ నిలిచారు. అందుకే ఆయన `ది రాక్‌` అని కూడా పిలుస్తుంటారు. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకునే డ్వేన్‌ జాన్సన్‌ ప్రస్తుతం `జంగిల్‌ క్రూయిజ్‌`, `రెడ్‌ నోటీస్‌`తోపాటు బ్లాక్‌ ఆడమ్‌ చిత్రంలో నటిస్తున్నారు.