తెలుగులో సక్సెస్ అయిన `జెర్సీ` సినిమాని అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ చిత్రంలోని ఓ పాట వంద మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా `జెర్సీ`(Jersey). నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో ఇది విశేష ప్రశంసలందుకుంది. ఈ నేపథ్యంలో దీన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. `జెర్సీ` పేరుతోనే షాహిద్ కపూర్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాకి మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. దిల్‌రాజ్ సమర్పణలో దిల్‌రాజు, సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని పాటలు చార్ట్ బస్టర్‌గా నిలుస్తుండటం విశేషం. ముఖ్యంగా `మైయ్యా మైను` అంటూ సాగే పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇది ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్ ని దాటేయడం విశేషం. బాలీవుడ్ సంగీత ద్వయం సచేత్, పరంపర ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. `కబీర్ సింగ్` తర్వాత షాహిద్ కపూర్‌కి ఈ సంగీత ద్వయం పనిచేసిన చిత్రమిది. ఈ చిత్రంలోని అన్ని పాటలకు మంచి స్పందన లభిస్తుంది.
అద్భుతమైన మెలోడీ శ్రోతల హృదయాలను తాకుతుంది. ముఖ్యంగా ఇందులో షాహిద్ కపూర్, ఆయనకు జోడీగా నటించిన మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీకి తగ్గట్టుగా పాట బాగా కుదిరింది. విశేషంగా ఆదరణ పొందుతుంది. ఇక `జెర్సీ` సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. బాలీవుడ్‌లో కరోనా తర్వాత సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. కరోనా తర్వాత అక్కడ భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా తెలుగు సినిమాలు `పుష్ప`, `ఆర్‌ఆర్‌ఆర్` నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో తెలుగు రీమేక్‌తో వస్తోన్న `జెర్సీ`పై కూడా భారీ అంచనాలున్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.
