నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కథ విన్నప్పుడే మరో ఆలోచన పెట్టుకోకుండా నాని ఈ సినిమా అంగీకరించాడు.

అంతగా కథ అతడిని మెప్పించింది. లేటు వయసులో క్రికెట్ బ్యాట్ పట్టి విజయాలు సాధించే ఆటగాడిగా నాని ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం నాని ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. బదులుగా సినిమాకు వచ్చే లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో అతడి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ దక్కుతుందని సమాచారం. ఈ సినిమా ద్వారా దాదాపు రూ.10 కోట్ల వరకు నానికి మిగులుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ను భారీ మొత్తానికి అమ్మారు.

ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ.50 కోట్ల వరకు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఏప్రిల్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. శ్రద్ధాశ్రీనాథ్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.