బిగ్ బాస్ షో కోసం పోటీదారులను ఎంపిక చేసే ప్రాసెస్ లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే.అలా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ షో నిర్వాహకులకు నాంపల్లి కోర్టులో పెద్ద ఊరట లభించింది. బిగ్ బాస్ కోఆర్డినేటర్లు అభిషేక్, రవికాంత్, రఘులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు షో పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్నారని, తమను లైంగికంగా వేధించారంటూ నటి గాయత్రి గుప్తా, యాంకర్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ తెలంగాణా హైకోర్టుని కూడా ఆశ్రయించారు.

బిగ్ బాస్ షోని అడ్డుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వారి ఆరోపణల్లో నిజం లేదని కోర్టుకి వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దని పోలీస్ శాఖను ఆదేశించింది. అయితే దీనికంటే ముందుగానే ముందస్తు బెయిల్ కోరుతూ బిగ్ బాస్ షో నిర్వాహకులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ని విచారించిన నాంపల్లి కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరోపక్క నటి గాయత్రి గుప్తా ఈ వ్యవహారంపై సైలెంట్ అయిపోయింది. రెండు, మూడు రోజులుగా  ఆమె మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. కానీ యాంకర్ శ్వేతారెడ్డి మాత్రం బిగ్ బాస్ షో ఆపేవరకు పోరాటం చేస్తూనే ఉంటానంటూ శపధాలు చేస్తోంది.   

ఇక షో విషయానికొస్తే.. మొదటి రెండు రోజులకే ఎలిమినేషన్ ప్రాసెస్ పెట్టి షోపై ఆసక్తిని కలిగించడంలో టీమ్ సక్సెస్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కి రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు నామినేట్ అయ్యారు.