మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. బయోపిక్‌ అని చెప్పి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు 
చేశారు.  

సినిమా రిలీజ్ అడ్డుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో సినిమా రిలీజ్ అడ్డంకులు ఎదురవుతాయేమోనని భావించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం నాడు తీర్పు వెల్లడించింది. ఇరువర్గాల వాదనను విన్న హైకోర్టు ‘సైరా’ సినిమా విడుదలను ఆపలేమని తేల్చిచెప్పింది.

‘సైరా’చిత్రంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలని పిటిషనర్‌కు సూచించింది. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఎవరూ చూపించడం లేదని ఉదాహరణలు చెప్పిన కోర్టు..  సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని తెలిపింది. దీంతో తెలంగాణలో సైరా సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి. 

అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.