మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజాకి, చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియోకి ఎంతో అనుబంధం ఉంది. గత నలభై ఏళ్లుగా ఆయన తన సినిమాలకు సంబంధించిన సంగీత కార్యక్రమాలను ప్రసాద్‌ స్టూడియోలోనే నిర్వహించేవారు. ఆయన అందులోనే ధ్యానం కూడా చేసుకునేవారు. ప్రశాంతతని కోరుకున్నప్పుడు అందులోకి వెళ్లే వారట. అయితే ఇటీవల ప్రసాద్‌ స్టూడియో యాజమాన్యానికి, ఇళయరాజాకి విభేదాలు చోటు చేసుకున్నాయి.  ప్రసాద్‌ స్టూడియో నుంచి ఇళయరాజాని ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

దీనిపై హైకోర్ట్ కి వెళ్ళారు ఇళయరాజా. దీనిపై చెన్నై హైకోర్ట్ విచారణ చేపట్టింది. ఒక్క రోజు ఇళయరాజా ధ్యానం చేసుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వరని మద్రాస్‌ హైక్ట్ ప్రసాద్‌ స్టూడియో నిర్వాహకులను ప్రశ్నించింది. సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో ఇళయరాజా కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఒక రూముని ప్రత్యేకంగా కేటాయించారు. అందులోనే ఇళయరాజా తన చిత్రాలకు సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. 

కానీ వీరి మధ్య వివాదం కారణంగా గత ఏడాది ఆ గదిని వేరే కార్యక్రమానికి కేటాయించడంతో ఇళయరాజాని ఖాళీ చేయాల్సిందిగా స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. దీంతో ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు కేసును సోమవారానికి వాయిదా వేసింది హైకోర్ట్.