Samantha: సమంత కోలుకున్నట్లే.... ఇదిగో ప్రూఫ్!
సమంత అనారోగ్యం బారినపడిన నేపథ్యంలో ఖుషి చిత్ర షూట్ డిలే అవుతుంది. కాగా మూవీ కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతుందని డైరెక్టర్ వెల్లడించగా సమంత కోలుకున్నారన్న స్పష్టత వచ్చింది.

సమంత మయోసైటిస్ తో పోరాడుతున్న విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ లో సమంత ఈ విషయం బయటపెట్టారు. అనారోగ్యంతో బాధపడుతూనే సమంత యశోద చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక సమంత ఆరోగ్యంపై అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఆమె కోలుకోవడం కష్టం. మెరుగైన వైద్యం కోసం దేశవిదేశాలు తిరుగుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
ఇటీవల ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంత పాల్గొన్నారు. ఓపిక లేకపోయినా డైరెక్టర్ గుణశేఖర్ కోసం వచ్చానని చెప్పి పుకార్లకు బలం చేకూర్చారు. ఆమెలో మునుపటి ఎనర్జీ కనిపించలేదు. చేతిలో జపమాల పట్టుకొని కొత్తగా తోచారు. సమంత హెల్త్ కండీషన్ ఏమిటనే పుకార్లు కొనసాగుతుండగా ఖుషి మూవీ డైరెక్టర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ వేదికగా ఖుషి నెక్స్ట్ షెడ్యూల్ పై కామెంట్ చేశారు. అతి త్వరలో ఖుషి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. మళ్ళీ అంతా అందంగా మారిపోబోతుంది... అని కామెంట్ పెట్టారు. శివ నిర్వాణ కామెంట్ ని బట్టి సమంత తిరిగి కోలుకున్నారు. ఆమె మరలా సినిమాల్లో బిజీ అవుతున్నారన్న స్పష్టత వచ్చింది. వెబ్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సమంత పూర్తిగా మయోసైటిస్ మహమ్మారి నుండి బయటపడ్డారనిపిస్తుంది. ఇది ఆమె అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నింపుతుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి షూట్ చాలా వరకు పూర్తయింది. కేవలం 20 శాతం పెండింగ్ ఉందట. మిగిలిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి సమ్మర్ ఎండింగ్ లేదా ఆగష్టులో విడుదల చేసే అవకాశం కలదంటున్నారు. వరుస పరాజయాలతో విజయ్ దేవరకొండ ఇబ్బంది పడుతుండగా... ఖుషి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.