స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన తొలి సంపాదన ఎంతో వెల్లడించింది. మొదటిసారి మోడలింగ్ చేసినందుకు ఆమె ఎంత తీసుకుందో చెప్పగా, ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.  

రకుల్ ప్రీత్ సింగ్ 2009లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కన్నడ మూవీ గిల్లి తో వెండితెరకు పరిచయం అయ్యింది. రెండో చిత్రం తెలుగులో చేసింది. కెరటం టైటిల్ తో విడుదలైన ఈ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి హిట్ చిత్రాల్లో నటించిన రకుల్ స్టార్ హోదా తెచ్చుకుంది. 

టాప్ స్టార్స్ సరసన నటించింది.సినిమాకు రూ. 3 కోట్లకు పైగా తీసుకుంటుంది. కాగా రకుల్ కెరీర్ మోడల్ గా మొదలైంది. మోడలింగ్ ద్వారా ఆమె తొలి సంపాదన ఎంతో తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది. రకుల్ ప్రీత్ మాట్లాడుతూ... పరిశ్రమకు వచ్చాక 25 ఏళ్ళ వయసు వచ్చే వరకు మా అమ్మ నాకు తోడుగా వచ్చేది. మోడల్ గా నా మొదటి సంపాదన రూ. 5 వేలు. అక్కడి నుండి ఈ స్థాయికి వచ్చాను. ఈ సక్సెస్ ఫుల్ జర్నీలో తల్లిదండ్రులు, సన్నిహితుల ప్రోత్సాహం, మద్దతు ఎంతగానో ఉంది. వాళ్ళు లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది... అన్నది. 

రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె ఏడడుగులు వేయనుంది. గోవాలో ఫిబ్రవరి 21న ఘనంగా పెళ్లి జరుగనుంది. రకుల్ ప్రీత్ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు హాజరు కానున్నారు. 2021లో జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

ఇక టాలీవుడ్ కి దూరమైన రకుల్ హిందీలో ఎక్కువగా చిత్రాలు చేస్తుంది. ఇటీవల తమిళ చిత్రం అయలాన్ లో నటించింది. ప్రస్తుతం మేరీ పత్నీ కా రీమేక్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది. రకుల్ ప్రీత్ స్టార్ డమ్ తగ్గింది. కెరీర్ నెమ్మదించాక తెలివిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది.