ఆర్ ఆర్ ఆర్ విషయంలో పప్పులో కాలేసిన ప్రియాంక చోప్రా... హర్ట్ అయిన తెలుగు ఆడియన్స్, ఓ రేంజ్ ట్రోలింగ్!
హీరోయిన్ ప్రియాంక చోప్రా టాలీవుడ్ ఆడియన్స్ ని హర్ట్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ తమిళ చిత్రమంటూ మనోభావాలు దెబ్బతీశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేస్తున్నారు.

విదేశాల్లో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్. అక్కడ తెరకెక్కే హిందీ సినిమాలు మాత్రమే. వాళ్లకు మన పరిశ్రమ గురించి తెలిసింది అదే. బాలీవుడ్ కి ధీటుగా సౌత్ ఇండియాలో, స్థానిక భాషల్లో చిత్రాలు తెరకెక్కుతాయని తెలియదు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి ఈ తేడా చెప్పే ప్రయత్నం చేశాడు. హిందీ పరిశ్రమను కించపరచకుండానే ఆర్ ఆర్ ఆర్ ఒక తెలుగు చిత్రమని అంతర్జాతీయ వేదికపై నొక్కి చెప్పారు. ఇండియన్ సినిమా భిన్న భాషలు సంస్కృతుల సమాహారమని చెప్పే ప్రయత్నం చేశారు.
ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలిచినప్పటికీ విదేశీయలు అదో తెలుగు చిత్రమని గుర్తించడం అంత సులభం కాదు. దానికి కొంత సమయం పడుతుంది. ఏ లాంగ్వేజ్ అనేది పక్కన పెడితే, విదేశీయులకు ఆర్ ఆర్ ఆర్ అంటే బాలీవుడ్ మూవీ. తెలుగు సినిమా పూర్తి స్థాయిలో ప్రపంచ గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పప్పులో కాలేయడం విచారకరం.
అమెరికాలో ప్రియాంక చోప్రా 'ఆర్మ్ ఛైర్ ఎక్స్పర్ట్ విత్ డాక్స్ షెపర్డ్' అనే పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హోస్ట్ డాక్స్ షెపర్డ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తావన తెచ్చారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ గురించి మాట్లాడుతూ ప్రియాంక చోప్రా అది ఒక బాలీవుడ్ మూవీ అన్నారు. తప్పును సరి చేసుకుంటూ ఆర్ ఆర్ ఆర్ బాలీవుడ్ మూవీ కాదు అదో తమిళ్ మూవీ అన్నారు. ఇది టాలీవుడ్ ఆడియన్స్ ని హర్ట్ చేసింది.
ఆర్ ఆర్ ఆర్ మూవీ బాలీవుడ్ మూవీ అని చెప్పడమే తప్పైతే కాదు అది తమిళ చిత్రమని చెప్పి ఆమె మరింతగా బాధపెట్టారని తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రాను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. తమిళ తంబీలు సైతం ఈ విషయంలో ప్రియాంక చోప్రా మీద కామెడీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇరవై ఏళ్లపాటు సినిమాలు చేసిన ప్రియాంక చోప్రాకు తెలుగు-తమిళ చిత్రాల మధ్య తేడా తెలియక పోవడం దారుణం అంటున్నారు.
ఆస్కార్ ఈవెంట్ కి వెళ్లిన రామ్ చరణ్ దంపతులను ప్రియాంక చోప్రా కలవడం విశేషం. మరి అప్పుడైనా ఆమెకు ఆర్ ఆర్ ఆర్ ఒక తెలుగు సినిమా అని అవగాహన రాలేదంటే శోచనీయం. మొత్తంగా తెలుగు ఆడియన్స్ మనోభావాలు దెబ్బతీసిన ప్రియాంక ఆగ్రహానికి గురయ్యారు.