బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా పెళ్లి పీఠలెక్కబోతుంది. బాలీవుడ్‌లో వరుసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అందాల భామ సైతం మ్యారేజ్‌కి సిద్ధమయ్యిందట. 

బాలీవుడ్‌లో పెళ్లిళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లు వరుసగా మ్యారేజ్‌ చేసుకుని సెటిల్‌ అవుతున్నారు. ఇటీవల కత్రినా కైఫ్‌, అలియాభట్‌, కియారా అద్వానీలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్‌ పెళ్లికి సిద్ధమయ్యింది. బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. ఆమె ఓ పొలిటికల్‌ లీడర్‌ని వివాహం చేసుకోబోతుందనే వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఆప్‌(ఆమ్‌ ఆద్మీ) పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా, పరిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. అంతేకాదు ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. ఇందులో పరిణీతి చోప్రా చేతి వేలికి ఉంగరం కనిపించడం విశేషం. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్టయ్యింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు కూడా కన్ఫమ్‌ చేశారు. 

`రాఘవ్‌ చద్దా, పరిణీతి ల రోకా ఫంక్షన్‌ జరిగింది. ఇది ఫ్యామిలీల మధ్యనేజరిగింది. ఈ విషయంలో రెండు ఫ్యామిలీలు సంతోషంగా ఉన్నాయి. వీరిద్దరు ఈ ఏడాది అక్టోబర్‌ చివరి నాటికి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. మ్యారేజ్‌ విషయంలో హడావుడి ఏం లేదు. పెళ్లి చేసుకోవడానికి ముందు వీరిద్దరికి వ్యక్తిగతంగా కొన్ని కమిట్‌మెంట్లు ఉన్నాయి. వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు` అని సన్నిహిత వర్గాలు నేషనల్‌ మీడియాకి తెలిపాయి. అయితే తమ రిలేషన్‌షిప్‌లో రాఘవ్‌గానీ, పరిణీతిగానీ కన్ఫమ్‌ చేయలేదు. కానీ తరచూ వీరిద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్ లో కనిపించడం విశేషం. దీంతో రూమర్లు ప్రారంభమయ్యాయి. 

ఇక కెరీర్‌ పరంగా పరిణీతి చోప్రా ప్రస్తుతం సూరజ్‌ బర్జత్యా రూపొందించిన `ఊన్చై`లో నటించింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, నీనా గుప్తా, అనుపమ్‌ ఖేర్‌, బొమన్‌ ఇరానీ నటించారు. దీంతోపాటు `కోడ్‌ నేమః తిరంగా`, `ది గర్ల్ ఆన్‌ ది ట్రైన్‌`, సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ వంటి చిత్రాల్లో మెరిసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె `ఛమ్కీలా`, `కాప్సులే గిల్‌` చిత్రాల్లో నటిస్తుంది. అన్నట్టు పరిణీతి చోప్రా.. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కజిన్‌ సిస్టర్‌ కావడం విశేషం. రాఘవ్‌ చద్దా.. ప్రస్తుతం ఆప్ పార్టీకి పంజాబ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.