భర్త దూరమైన విషాదం నుండి మీనా బయటపడిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె నార్మల్ లైఫ్ కి వచ్చేశారు. సోషల్ మీడియా పోస్ట్స్ అందుకు నిదర్శనమని చెప్పొచ్చు.
గత ఏడాది జూన్ 28న మీనా జీవితంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం పొందారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన విద్యాసాగర్ ఊహించని విధంగా కన్నుమూశారు. భర్త మరణం మీనాను తీవ్ర వేదనకు గురి చేసింది. తక్కువ ప్రాయంలోనే ఆమె తోడును కోల్పోయారు. మీనాకు నైనిక అనే ఒక కూతురు ఉన్నారు. విద్యాసాగర్ మరణంతో మీనా, నైనిక ఒంటరివాళ్లయ్యారు. నటిగా మీనాది నాలుగు దశాబ్దాల ప్రస్థానం. బాలనటిగా పరిశ్రమలో అడుగుపెట్టిన మీనా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించారు. వందల చిత్రాల్లో నటించారు.
స్టార్ హీరోయిన్ అయిన మీనా 2009లో బెంగుళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు విద్యాసాగర్ ఆమెకు శాశ్వతంగా దూరం అయ్యారు. భర్త మరణంతో మీనా డిప్రెషన్ కి గురయ్యారు. సన్నిహితులు, పరిశ్రమ మిత్రులు ఆమెను కలిసి ఓదార్చారు. ఈ వేదన నుండి బయటపడేందుకు మీనా విదేశీ టూర్స్ కి వెళ్లారు. ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుని దాదాపు 8 నెలలు అవుతుండగా మీనా బయటపడ్డ సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఒక ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో ఆమె చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు.
కాగా ఇటీవల మీనా రెండో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చాలా చిన్న వయసులో పరిశ్రమకు వచ్చిన మీనా వివాహం లేటుగా చేసుకున్నారు. 33 ఏళ్ల వయసులో ఆమెకు వివాహం జరిగింది. ప్రస్తుతం మీనా వయసు 46 సంవత్సరాలు. ఈ క్రమంలో పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. కూతురు, తన భవిష్యత్ కోసం పెళ్లి చేసుకునే అవకాశం కలదంటున్నారు. ప్రస్తుతం మీనా జనమ్మ డేవిడ్ అనే మలయాళ చిత్రంలో చేస్తున్నారు.
