`లోఫర్‌` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని తండ్రికి కరోనా సోకింది. తాజాగా ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్టు తేలింది.  దిశా తండ్రి జగదీష్‌ పటానీ ఉత్తర ప్రదేశ్‌లోని పవర్‌ డిపార్ట్ మెంట్‌లో విజిలెన్స్ విభాగంలో డిప్యూటీ ఎస్పీగా పనిచేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కుంభకోణంపై దర్యాప్తున‌కు దిశా తండ్రి జగదీష్ పటానీ, మరో ఇద్దరు అధికారులు లక్నో నుంచి బ‌రేలీకి వచ్చారని తెలిపారు. వీరి ముగ్గురి క‌రోనా రిపోర్టుల‌లో పాజిటివ్ వచ్చిందని బ‌రేలీ జిల్లా విజిలెన్స్‌ అధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఈ సమాచారం మీడియా ముందు వెల్ల‌డించారు. 

ఈ అధికారులకు క‌రోనా సోకిన‌ నేప‌థ్యంలో జోనల్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని రెండు రోజులపాటు మూసివేయ‌నున్నారు. తండ్రికి కరోనా సోకిందనే వార్తతో దిశా షాక్‌కి గురయ్యారు. తమ కుటుంబానికి కూడా కరోనా టెస్ట్ చేయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్టు సమాచారం. 

ఇక దిశా పటానీ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఇందులో వరుణ్‌తేజ్‌తో రొమాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సుశాంత్‌ హీరోగా నటించిన `ఎంఎస్‌ధోనిః ది అన్‌టోల్డ్ స్టోరీ`లో ఓ హీరోయిన్‌గా మెరిసింది. ఆ తర్వాత `బాఘి2`తో మంచి హిట్‌ని అందుకుంది. సల్మాన్‌తో `భారత్‌`లో, అలాగే టైగర్‌ షరాఫ్‌తో `బాఘి3`లో హీరోయిన్‌గా నటించిన ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ `కేటినా`తోపాటు సల్మాన్‌ సరసన `రాధే` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.