హీరోయిన్ భావన కిడ్నాప్ కేసులో ఎనిమిది మంది అరెస్ట్ నిందితులు అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు,ఫోటోలు తీశారన్న భావన గంటన్నరపాటు ఆమె కారులోనే భావనను హింసించిన నిందితులు


తెలుగుతో పాటు పలు సౌత్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ భావన ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిప్పు, ఒంటరి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది హీరోయిన్ భావన. మహాత్మ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన భావన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఎప్పటిలానే షూటింగ్ కంప్లీట్ చేసుకుని తన ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో తన కారును కొందరు అడ్డగించి భావన కారును ఆదీనంలోకి తీసుకున్నారు. కారును దాదాపు 25 కిలో మీటర్ వరకు ఆమెను నానా రకాలుగా హింసిస్తూ... అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు ఫోటోలు తీశారు. కొట్టి హింసించడమే కాకుండా లైంగికంగా వేధించారని భావన పిర్యాదు చేసింది. ఏం చేస్తారోనని భయపడ్డానంటున్న భావన అదృష్టవశాత్తు సురక్షితంగా బయట పడింది. 

భావన కారు కొచ్చిలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు రాగానే టెంపోతో ఢీ కొట్టి యాక్సిడెంట్ చేసారు. భావన కారులో ఉన్న డ్రైవర్‌ను తప్పించి టెంపోలోని ఇద్దరు వ్యక్తులు భావన కారులో చొరబడ్డారు. భావన కారును తమ ఆధీనంలోకి తీసుకున్న దుండగులు గంటన్నరపాటు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొచ్చి నగరంలో కారును తిప్పారని, ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఆమె ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పలరివట్లోమ్ జంక్షన్ వద్ద భావనను ఆమె కారులోనే కిడ్నాప్ చేసి గంటన్నర పాటు తిప్పిన దుండగులు పలరివట్లోమ్ జంక్షన్ వద్ద కారును, ఆమెను వదిలి పారిపోయారు. భావన ఒంటరిగా కారు నడుపుకుంటూ దగ్గర్లో తనకు తెలిసిన వారింటికి వెళ్లి జరిగిన విషయం చెప్పి... అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ సంఘటన వెనక భావన వద్ద గతంలో పని చేసిన డ్రైవర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్ హస్తం ఉందని భావిస్తున్నారు. అతడిపై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తనపై అనవసర, అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న కారణంతోనే భావన అతడిని డ్రైవర్ గా తొలగించి మార్టిన్ అనే వ్యక్తిని నియమించుకుంది. అయితే ఈ సంఘటన తర్వాత మార్టిన్ మీద కూడా అనుమానాలు పెరిగాయి. మార్టిన్ కు తెలిసే ఇదంతా జరిగిందా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మార్టిన్ ప్రవర్తన అనుమానంగా అనిపించిందని భావన పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మార్టిన్ సహాయంతోనే పల్సర్ సునీల్ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. భావన డ్రైవర్ మార్టిన్, నిందితుడు పల్సర్ సునీల్ సహా మరో ఆరుగురు అరెస్టయిన వారిలో ఉన్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలతో పాటు మళయాళ సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. భావన పట్ల జరిగిన ఘటనను మళయాళ సినీపరిశ్రమ ముక్తకంఠంతో ఖండించింది. భావనకు ఇండస్ట్రీ అండగా ఉంటుందని, పోలీసులు నిందితులను వెంటనే నిర్భయ చట్టం కింద శిక్షించాలని డిమాండ్ చేశారు,