విక్రమ్‌ విలక్షణ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌. సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలోనూ దిట్ట. `అపరిచితుడు`, `కాశీ`, `శివపుత్రుడు`, `రావనన్‌`, `ఐ` చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆయా చిత్రాల్లో తన నట విశ్వరూపం చూపించారు. యాభై నాలుగు ఏళ్ళ వయసులో కూడా పాత్ర కోసం తన బాడీని మలుచుకోవడం నటన పట్ల ఆయనకున్న ప్యాషన్‌కి అద్దం పడుతుంది. 

తాజాగా మరోసారి తన నిబద్ధతని చాటుకున్నారు. అంతేకాదు ఈ సారి యంగ్‌ హీరోలకు షాక్‌ ఇచ్చారు. యంగ్‌స్టర్స్ ని మించిపోతున్నారు. తాజాగా సిక్స్ ప్యాక్‌లో దర్శనమిస్తున్నాడు విక్రమ్‌. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీన్ని విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది అటు ఇన్‌స్టాగ్రామ్‌, ఇటు ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. 

మరి ఈ కొత్త లుక్‌ ఎందుకోసమని ఆయన అభిమానులు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్‌ `కోబ్రా` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విక్రమ్‌ ఏడు పాత్రలో కనిపించనున్నారు. విభిన్న వయసు గల వ్యక్తులుగా నటిస్తున్నారు. దీనికి ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు `మహావీర్‌ కర్ణ`, `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

వీటితోపాటు కార్తీక్‌ సుబ్బరాజు డైరెక్షన్‌లో తన 60వ చిత్రం చేస్తున్నారు విక్రమ్‌. అయితే ఇందుకోసమే ఈ కొత్త లుక్‌ అని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇందులో తన తనయుడు ధృవ్‌ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారట. మొత్తానికి విక్రమ్‌ యంగ్‌ హీరోలను మించి యాభై నాలుగు ఏళ్ళ వయసులో ఇలా సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ లుక్‌ చూసి ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.