సోషల్ మీడియా యుగంలో చేసే ప్రతి పని, మాట్లాడే మాట విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే నెటిజెన్స్ దగ్గర బుక్ అయిపోవడం ఖాయం. సమాజంలో ఫేమ్ ఉన్న సెలెబ్రిటీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేసిన ఓ పని వివాదాస్పదం కాగా నెటిజెన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో విజయ్ సేతుపతి బహిరంగ క్షమాపణలు కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

విషయంలోకి వెళితే జనవరి 16, విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన షూటింగ్ సెట్స్ లో పుట్టినరోజు వేడుకలు జరిపారు. చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా యూనిట్ సభ్యుల కోరిక మేరకు ఆయన ఓ పొడవైన కత్తితో కేక్ కట్ చేశారు. ఈ సెలెబ్రేషన్స్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా, నెటిజెన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. 

బర్త్ డే కేక్ ను ఒక మారణాయుధం ద్వారా కట్ చేసి.. సమాజంలోకి చెడు సందేశాన్ని విజయ్ సేతుపతి పంపారని వారు ఆరోపించారు. సోషల్ మీడియాలో మొదలైన వ్యతిరేకత నేపథ్యంలో విజయ్ స్పందించారు. మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన సోషల్ మీడియా సందేశం విడుదల చేశారు. తాను నటిస్తున్న ప్రస్తుత చిత్రంలో కత్తికి చాలా ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఆ మూవీ సెట్స్ లో కత్తితో కేక్ కట్ చేశాననని ఆయన వివరణ ఇచ్చారు.