కోలీవుడ్ లో దళపతి విజయ్ అతిపెద్ద మాస్ హీరోగా అవతరించారు. కొన్నాళ్లుగా వరుస విజయాలతో దూసుకెళుతున్న విజయ్ ఫాలోయింగ్ రజినిని కూడా మించిపోయాడు. విజయ్ గత ఏడాది విడుదల చేసిన బిగిల్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేశీయంగా 200 కోట్లు వసూళ్లు సాధించిన హీరోగా విజయ్ ఆ చిత్రంతో రికార్డులకు ఎక్కారు. తెలుగులో సైతం ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. తమిళనాడు సీఎంగా విజయ్ ని చూడాలనేది వారి ఆకాంక్ష. 

ఈ విషయంలో  విజయ్ ని ఒప్పించేలా ఆయన తండ్రిగారైన చంద్రశేఖర్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చంద్రశేఖర్ కూడా కొంచెం సీరియస్ గానే ముందుకు వెళుతున్నారట. అలాగే ఆయన ఓ కొత్త పార్టీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారట. దానికోసం ఆయన ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ లాయర్ ని సంప్రదించారనేది కోలీవుడ్ టాక్. దీనితో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ ఎన్నికల బరిలో దిగడం ఖాయం అంటున్నారు. 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళనాట రాజకీయాలలో అనిశ్చిత నెలకొంది. అధికార పక్షం వర్గపోరుతో బలహీనపడింది. కరుణానిధి మరణం తరువాత ప్రధాన ప్రతిపక్షం కూడా వీక్ గానే ఉంది. దీనితో ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా ఎదగాలని కమల్ , రజిని లాంటి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో విజయ్ లాంటి స్టార్ హీరో ఎంట్రీ అక్కడ రాజకీయాలపై బలమైన ముద్ర వేయడం ఖాయం.