తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి తిరుపూర్ బీజేపీ కార్యకర్తల నుండి సోమవారం కాషాయ వస్త్రాలతో కూడిన పార్సిల్ వచ్చింది. విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో బీజేపీని పరోక్షంగా విమర్శించారు.

సినిమాను ఎంజీఆర్ తప్ప ఎవరూ కాపాడలేదని, పైరసీదారులకు రాజకీయనాయకులే అండగా నిలుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఈ విషయంలో పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయాలని అన్నారు.

అలానే ఎన్నికల ఫలితాల తరువాత మనమందరం కాషాయ వస్త్రాలు చుట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుందని బీజేపీపై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తిరుపూర్ కి చెందిన బీజేపీ యువజన విభాగం పేరుతో ఆయన ఇంటికి ఓ పార్సిల్ వచ్చింది. అందులో కాషాయ పంచె, ఒక లెటర్ ని జత చేసి ఉంచారు.

అందులో మొదటిసారిగా కాషాయ వస్త్రాన్ని పంపుతున్నామని, ఇకపై వరుసగా ఇలాంటి వస్త్రాలను పంపుతూనే ఉంటామని, ఎందుకంటే ఇకపై మీరు కాషాయ వస్త్రాలనే ధరించి తిరిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.