మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుణ్ తేజ్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కానీ కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారి 44పై కొత్తకోట మండలం రాయని పేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరుణ్ తేజ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్ తేజ్ కారు మరో కారుని ఢీ కొనడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. వాల్మీకి షూటింగ్ కోసం వరుణ్ తేజ్ బెంగుళూరుకు వెళుతున్నాడు. ప్రయాణిస్తున్న సమయంలో వరుణ్ తేజ్ వాహనం దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో వరుణ్ తేజ్, ఆయన వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులుకు ఎలాంటి గాయాలు కాలేదు. ఢీ కొన్న మరో వాహనంలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మొత్తం 6 వాహనాల్లో బయలుదేరారు. ప్రమాదం తర్వాత వరుణ్ తేజ్ మరో కారులో బెంగుళూరు వెళ్ళాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. 

రోడ్డుప్రమాదంపై సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ స్పందించారు. "రోడ్డు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అందరం సురక్షితం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నాపై మీ ప్రేమాభిమానాలు చూపించినందుకు ధన్యవాదాలు" అని ఆయన అన్నారు.