యంగ్ హీరో సందీప్ కిషన్ అభిమాని ఒకరు ఈరోజు మరణించారు. అతడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన హీరో సందీప్ కిషన్ సదరు అభిమాని కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో.. ''నాకు మద్దతుగా నిలిచిన వ్యక్తులలో శ్రీను ఒకరు. పరిస్థితులు ఎలా ఉన్నా.. నావైపు నిలబడ్డాడు. నాకు ఎంతో నమ్మకమైన అభిమాని. నా సోదరుడిని కోల్పోయాను. చిన్న వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. శ్రీనుకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అతడి కుటుంబం బాధ్యత నాది. లవ్యూ శ్రీను... ఎప్పటికీ నిన్ను మిస్ అవుతుంటా.. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అంటూ రాసుకొచ్చారు.

తనను అభిమానించే వ్యక్తి కుటుంబానికి బాసటగా నిలుస్తానని సందీప్ చెప్పడంతో నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సందీప్.. 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే 'సుబ్రమణ్యపురం' చిత్రదర్శకుడితో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు.