Asianet News TeluguAsianet News Telugu

టికెట్ ధరలపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన సిద్ధార్థ్.. మందు, సిగరెట్ పైన ఉండే శ్రద్ధ సినిమాపై లేదు

సినిమా టికెట్ ధరలు, అదనపు షోల విషయంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు నెమ్మదిగా వాయిస్ పెంచుతున్నారు. టికెట్ రేట్లని తగ్గించి, ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం.

Hero Siddharth sensational comments on Ticket price
Author
Hyderabad, First Published Dec 3, 2021, 4:07 PM IST

సినిమా టికెట్ ధరలు, అదనపు షోల విషయంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు నెమ్మదిగా వాయిస్ పెంచుతున్నారు. టికెట్ రేట్లని తగ్గించి, ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. అలాగే బెనిఫిట్ షోలు, అదనపు షోలని కూడా రద్దు చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. సినీ నిర్మాతలు, ప్రభుత్వం మధ్య ఎన్ని చర్చలు జరిగినా టాలీవుడ్ కి అనుకూలంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించలేదు. 

దీనితో క్రమంగా టాలీవుడ్ లో వాయిస్ పెరుగుతోంది. ప్రభుత్వంతో గొడవలు వద్దు అని భావించిన పెద్దలే సోషల్ మీడియా వేదికగా ఏపీ టికెట్ ధరల వల్ల నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. Pawan Kalyan ఇప్పటికే రిపబ్లిక్ ఈవెంట్ వేదికగా టికెట్ ధరల విషయంలో ఎపి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవల Chiranjeevi కూడా సోషల్ మీడియా వేదికగా టికెట్ ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలి అని కోరారు. అలాగే దర్శకేంద్రుడు Raghavendra Rao ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు, అదనపు షోల రద్దు వల్ల సినిమాని నమ్ముకున్న వారికీ తీవ్ర నష్టం వాటిల్లుతుందని సంచలన లేఖతో హెచ్చరించారు. 

తాజాగా Bommarillu ఫేమ్ హీరో Siddharth టికెట్ ధరలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్స్ చేశాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం నేను విదేశాల్లో తొలిసారి సినిమా చూశాను. అప్పట్లో టికెట్ ధర 8 డాలర్లు అంటే దాదాపు రూ 200 ఉండేది. స్టూడెంట్ కార్డు ఉపయోగించడం వల్ల టికెట్ ప్రైస్ తగ్గింది. ఈ రోజు మన ఇండియన్ చిత్రాలు ప్రపంచ చిత్రాలతో పోటీ పడుతున్నాయి. టెక్నాలజీ, మేకింగ్ పరంగా ఎవ్వరికి మనం తక్కువ కాదు. 

టికెట్ ధరల్ని నిర్ణయించే నైతిక హక్కు ప్రభుత్వాలని కానీ, రాజకీయా నాయకులకి కానీ లేదు. ఎందుకంటే మీకు సినిమా కంటే మద్యం, సిగరెట్స్ లాంటి టొబాకో ప్రొడక్ట్స్ పైనే గౌరవం ఎక్కువ. ఆ అరాచకాన్ని ఆపండి. చట్టబద్ధంగా ఎంతోమంది శ్రమిస్తేనే సినిమా బిజినెస్ జరుగుతోంది. మాపై టాక్సులు విధించండి, సెన్సార్ చేయండి.. ఇంకా చట్టబద్ధంగా ఏమి చేయాలో అవన్నీ చేసుకోండి.. కానీ మేము ఎలా బిజినెస్ చేసుకోవాలో మాత్రం మాకు చెప్పొద్దు అని సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Katrina Kaif: మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికీ కత్రినా ఊహించని షాక్.. త్వరలో పెళ్లి పెట్టుకుని ఇలా చేసిందేంటి ?

నిర్మాతలు, వాళ్ళ ఉద్యోగుల జీవితాలు నాశనం చేసేలా వ్యవహరించొద్దు. సినిమాని చూడమని ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. ఇంకా సినిమా పైరసీ వల్ల నష్టపోతూనే ఉంది. సినిమా వారి నుంచి చాలా మంది చారిటి ఆశిస్తున్నారు. కానీ సినిమా నుంచి ఎలాంటి సబ్సిడీ లభించదు. 

సినిమా బడ్జెట్, స్థాయిని బయటివాళ్ళెవరూ నిర్ణయించలేరు. అది మేకర్ ఇష్టం. అలాగే సినిమా నుంచి ఎంత సంపాదించాలి అనేది కూడా ఒకరు నిర్ణయించే విషయం కాదు. సినిమా ఇండస్ట్రీపై ఒత్తిడి చేయడం ఆపండి. మీకు చారిటి కావాలనుకుంటే వ్యాపారవేత్తలని, రాజకీయ నాయకులని ప్రశ్నించండి. 

మాకు కూడా అన్నం విలువ, రైతు గొప్పతనం తెలుసు. వారి కోసం మేము తప్పకుండా నిలబడతాం. మేము రైతులంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు కానీ మేము కూడా మనుషులమే.. మేమూ టాక్సులు కడుతున్నాం అని సిద్ధార్థ్ వరుస ట్వీట్స్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios