తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా? బొమ్మరిల్లు లాంటి స్ట్రైట్ సినిమాలు తీసేంతగా పాపులర్ అయిన హీరో సిద్దార్థ్... ఆ స్టార్ డమ్‌ని అలాగే నిలబెట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయి తర్వాత మళ్ళీ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడకూడా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలేం లేకపోవటంతో చాలాకాలంగా సైలెంట్ అయిపోయాడు. ఆఫర్స్ రాకపోవటంతో తానే ఒక సొంత బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించటం మొదలు పెట్టాడు.

 

‘ఇటాకి ఎంటర్టైన్మెంట్స్' పేరుతో ఒక బేనర్ పెట్టి... ఈ బేనర్ మీదే రెండు మూడు సినిమాలు నిర్మించాడు సిద్దార్థ్. తాజాగా తను హీరోగా తెరకెక్కిన హార్రర్ మూవీ ‘గృహం' కూడా ఈ బేనర్ నుంచి వస్తున్నదే. సిద్దార్థ్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తీసిన హార్రర్ మూవీకి తెలుగులో ‘గృహం' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను నవంబరు 3న ఒకేసారి మూడు భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకున్నాడు సిద్ధు. కానీ రిలీజ్ ఆపుకోవాల్సి వచ్చింది.

 

హైదరాబాద్ వచ్చి నాని ముఖ్య అతిథిగా ఓ ఈవెంట్ కూడా చేశాడు. హార్రర్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ శుక్రవారం ఈ సినిమా చూసే అవకాశం వారికి దక్కట్లేదు. సిద్ధు సినిమాకు ఈ వారం తెలుగులో ఆశించిన స్థాయిలో థియేటర్లు ఇవ్వకపోవడంతో రిలీజ్ ఆపుకోవాల్సి వచ్చింది.

 

తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజవుతుండటంతో ప్రమోషన్లు, ఇతర రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే అతడి సినిమాకు థియేటర్లే ఇవ్వట్లేదు. హైదరాబాద్‌కు వచ్చి థియేటర్ల సంగతి తేల్చుకునే సమయం లేకపోయింది. దీంతో తెలుగులో రిలీజ్ ఆపక తప్పట్లేదు.

 

గత రెండు వారాల్లో వచ్చిన ‘రాజా ది గ్రేట్'.. ‘ఉన్నది ఒకటే జిందగీ'లకు బలమైన బ్యాకప్ ఉండటంతో ఈ వీకెండ్లో కూడా వాటిని చాలా చోట్ల కొనసాగిస్తున్నారు. ఇక ఈ వీకెండ్లో ‘గరుడవేగ'.. ‘నెక్స్ట్ నువ్వే'.. ‘ఏంజెల్' సినిమాలు రిలీజవుతున్నాయి. వీటికే థియేటర్ల కొరత కనిపిస్తోంది. ఇక డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో సిద్ధు సినిమా తెలుగు రిలీజ్ ఆగిపోయింది. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంటుగా ఉన్న సిద్ధు.. ఆ తర్వాత మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు.