శర్వానంద్ (Sharwanand) టైం అసలేం బాలేదు. వరుస ప్లాప్స్ తో ఆయన డీలా పడ్డారు. హిట్ కొడితే కానీ కెరీర్ నిలబడేట్టు కనబడుతుండగా... ఆడాళ్ళనే నమ్ముకున్నారు. లక్కీ హీరోయిన్ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు ఫలితం పైనే ఆయన కెరీర్ ఆధారపడి ఉంది.

హీరో శర్వానంద్ కి వరుసగా ఐదు ప్లాప్స్ పడ్డాయి. 2017లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు సూపర్ హిట్. శర్వానంద్ ఇమేజ్, మార్కెట్ మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అది. మహానుభావుడు మూవీ తర్వాత శర్వానంద్ కి మరో హిట్ దక్కలేదు. హిట్ కోసం కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. రణరంగం, మహా సముద్రం కమర్షియల్ అంశాలతో తెరకెక్కాయి. ఈ చిత్రాల్లో శర్వానంద్ మాస్ రోల్స్ చేశారు. 

ఇక పడి పడి లేచే మనసు, జాను రొమాంటిక్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కాయి. జాను తమిళ హిట్ మూవీ 96 కి అధికారిక రీమేక్. ఇక శ్రీకారం అవుట్ అండ్ అవుట్ విలేజ్ డ్రామాగా తెరకెక్కింది. డిఫరెంట్ జోనర్స్ లో వచ్చిన శర్వానంద్ చిత్రాలు అనూహ్యంగా పరాజయం పాలయ్యాయి. నెక్స్ట్ ఎలాంటి కథను ఎంచుకోవాలనే సందిగ్ధత శర్వానంద్ లో మొదలైంది. ఆ సమయంలో ఆయన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నారు. 

దర్శకుడు కిషోర్ తిరుమల ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. రష్మిక (Rashmika Mandanna)హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, రాధిక, ఊర్వశి వంటి సీనియర్ హీరోయిన్స్ తో పాటు, లెక్కకు మించిన లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి. పెళ్లి కాక ఇబ్బంది పడే అబ్బాయిగా శర్వానంద్ నటిస్తున్నారు. ఈ సినిమా పక్కా విజయం సాధిస్తుందని శర్వానంద్ నమ్ముతున్నాడు. 

YouTube video player

శర్వా కెరీర్ లో భారీ హిట్స్ గా ఉన్న శతమానం భవతి, మహానుభావుడు ఇదే జోనర్ తెరకెక్కిన చిత్రాలు. అటు రష్మిక సెంటిమెంట్ కలిసొచ్చినా కూడా శర్వానంద్ కి భారీ హిట్ దక్కుతుంది. ఈ మధ్య కాలంలో రష్మిక నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నితిన్ ని ఆమె భీష్మ చిత్రంతో రక్షించింది. మరి ఇన్ని అనుకూలతలున్న ఆడవాళ్లు మీకు జోహార్లు హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు (Adavallu meeku joharlu)మార్చి 4న గ్రాండ్ గా విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి నేడు ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల కావాల్సింది. భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో మూవీ వాయిదా వేశారు. మరోవైపు శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్కినేని అమల చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఒకే ఒక జీవితం చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.