స్టార్ హీరో రామ్‌పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో రామ్‌ తాతయ్య మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఓ ఎమోషనల్ ట్వీట్‌ పెట్టారు. కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారని రామ్‌ అన్నారు.

‘‘తాతయ్య.. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ అని రామ్‌ పేర్కొన్నారు.
 
కెరీర్ విషయానికి వస్తే... రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నాడట. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా తెలుగు - తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.