రోడ్డు ప్రమాదానికి గురైన హీరో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డ రాజశేఖర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు

 సినీ నటుడు రాజశేఖర్‌కి ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన స్పల్ప గాయాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. సినిమా చిత్రీకరణ ముగించుకుని ఆదివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్ లోని తన ఇంటికి వాహనంలో బయలుదేరారు. వాహనాన్ని ఆయనే స్వయంగా నడుపుకుంటూ వస్తుండగా రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

దీంతో ముందు వైపు కారులో ఉన్న బిల్డర్‌ రామిరెడ్డి రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ మద్యం సేవించి వాహనం నడిపారని రామిరెడ్డి ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజశేఖర్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయనకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు కూడా చేశారు.

సమాచారం అందుకున్న రాజశేఖర్ భార్య జీవిత పోలీస్ స్టేషన్ కి హుటాహుటిన చేరుకున్నారు. కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆమె బిల్లడ్ రామిరెడ్డిని కోరగా అందుకు ఆయన అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు కొట్టేశారు. తన భర్త మద్యం సేవించి వాహనం నడపలేదని ఈ సందర్భంగా జీవిత తెలిపారు.