ప్రముఖ హీరో రాజశేఖర్ నడుపుతున్న కారు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే‌పై ముందు వెళ్తున్న రామిరెడ్డి అనే బిల్డర్ కారును రాజశేఖర్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే రాజశేఖర్ తాగి కారు నడిపి తన కారును ఢీకొట్టారని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరవాత పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. అయితే ఆయన కారు ప్రమాదానికి గురికావడానికి కారణమేంటని పోలీసులు ఆరా తీశారు.

 

కుటుంబ సభ్యులతో నెలకొన్న గొడవల కారణంగా మనస్తాపం చెందిన రాజశేఖర్.. నిద్రమాత్రలు తీసుకున్నారని, ఆ మత్తులోనే పీవీ ఎక్స్‌ప్రెస్‌పైకి వచ్చి మరో కారును ఢీకొన్నారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎస్‌ఐ ప్రసాద్ వివరాల ప్రకారం.. రాజశేఖర్ తల్లి కొద్దిరోజుల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆయన ముభావంగా ఉంటున్నారు. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. సోమవారం ఇంట్లో పెద్దకర్మ కూడా జరగాల్సి ఉంది. చనిపోయిన తల్లి మళ్లీ రాదని, ఇలా ఎన్ని రోజులు బాధపడతారని ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు రాజశేఖర్‌ను ప్రశ్నించారు. మాటమాట పెరగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది.

దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ స్లీపింగ్ పిల్స్ మింగారట. అనంతరం కారు తీసుకొని పీవీ ఎక్స్ ప్రెస్ వే పైకి వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.