తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు హీరో  ప్రభాస్‌ మద్దతు తెలిపారు. కంగారుపడకండి...అది రాజకీయ  మద్దతు కాదు!  కేటీఆర్ ప్రజాప్రయోజనార్దం ట్విట్టర్ లో షేర్ చేసిన కొన్ని ఫొటోలను రీ ట్వీట్ చేసి తన అభిమానులు కూడా ఫాలో అవ్వమని షేర్ చేసారు. కేటీఆర్ రీసెంట్ గా సాహో సినిమా చూసి ..సినిమా చాలా బాగుందని, అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఎదిగిందంటూ ట్వీట్స్ చేసారు.

అలా ప్రభాస్ అభిమానుల మద్దతు ఆయన కూడగట్టుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ సైతం ఇలా కేటీఆర్ ట్వీట్ ని రీట్వీట్ చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజిలో ఉంది. వారందరికీ ఓ మంచి విషయం షేర్ చేసినట్లైంది. ఇంతకీ ఏమిటా మంచి విషయం అంటే...

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కొన్ని సూచనలు చేశారు. 'వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్‌ కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాం. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి'' అని ట్వీట్‌ చేశారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన పనికి  ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా మద్దతు తెలిపారు. కేటీఆర్‌ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ప్రభాస్‌ తిరిగి పంచుకుంటూ 'వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ రాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. దయచేసి ఈ విషయాన్ని అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్యంగా ఉండండి'' అని పేర్కొన్నారు. ప్రభాస్‌ మద్దతు తెలిపినందుకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.