ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. చిత్ర యూనిట్ పై ఆయన ప్రశంసలు కురిపించారు.
''ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు నాటు...’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి అభినందనలు. తెలుగు గీతానికి ఉన్న కీర్తిప్రతిష్టలు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపజేసింది. ‘నాటు నాటు’ గీతాన్ని రచించిన శ్రీ చంద్రబోస్, ఆలపించిన గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైన కూడా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపొందించిన దర్శకుడు శ్రీ రాజమౌళి, చిత్ర కథానాయకులు శ్రీ రాంచరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య అభినందనీయులు''... అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రపంచ సినిమా వేదికపై ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకుంటుంది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోగా... చిరంజీవి, ఏ ఆర్ రెహమాన్ తో పాటు పలువురు ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా... భారతీయ చిత్ర వర్గాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం చారిత్రాత్మక విజయం అంటూ కొనియాడారు.
ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సైతం ఈ అరుదైన సంఘటనపై స్పందించారు. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి ఎంపిక కావడం అద్భుతమంటూ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఏ ఆర్ రెహమాన్ 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ హీరో ఎన్టీఆర్ సైతం ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కీరవాణి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పై స్పందించారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అని ఎన్టీఆర్ కీరవాణిని పొగడ్తలతో ముంచెత్తారు. కేరీర్లో ఎన్ని పాటలకు డాన్స్ చేశాను. నాటు నాటు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీ ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
