ఎన్టీఆర్ గ్యారేజ్, ప్లాప్ దర్శకులకు హిట్స్ ఇవ్వ బడును!
ఎన్టీఆర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న దర్శకులకు ఛాన్స్ ఇచ్చిన హిట్ ట్రాక్ ఎక్కిస్తున్నాడు. ఈ లిస్ట్ లో కొరటాల శివతో పాటు ఎవరెవరు ఉన్నారో తెలుసా?
సాధారణంగా ప్లాప్ దర్శకులకు హీరోలు ఆఫర్స్ ఇవ్వరు. స్టార్ హీరోలు అయితే అసలు పట్టించుకోరు. పరిశ్రమలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. అది నటుడైనా, దర్శకుడైనా... వరుసగా నాలుగు ప్లాప్స్ పడితే కెరీర్ అయోమయంలో పడుతుంది.
సక్సెస్ లేని వారిని పరిశ్రమ పట్టించుకోదు. అవకాశం ఇవ్వడానికి భయపడతారు. ఇందుకు భిన్నంగా ప్లాప్స్ లో ఉన్న దర్శకులకు ఛాన్స్ ఇచ్చి వారితో హిట్స్ కొడుతున్నాడు ఎన్టీఆర్. డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడికి నెక్స్ట్ ఆఫర్ ఇచ్చిన మ్యాజిక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ అవకాశం ఇచ్చిన ప్లాప్ దర్శకుల లిస్ట్ పెద్దదే..
పూరి జగన్నాధ్
బిజినెస్ మేన్ అనంతరం పూరి జగన్నాధ్ కి సాలిడ్ హిట్ లేదు. పవన్ కళ్యాణ్ తో చేసిన కెమెరా గంగతో రాంబాబు యావరేజ్ అని చెప్పాలి. కంటెంట్ బాగున్నా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ఇద్దరు అమ్మాయిలతో సైతం... పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ఇది అబౌవ్ యావరేజ్ అనొచ్చు.
అనంతరం హార్ట్ అటాక్ టైటిల్ తో నితిన్ హీరోగా రొమాంటిక్ లవ్ డ్రామా చేశాడు. ఆదా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఎన్టీఆర్ దర్శకుడు పూరి జగన్నాధ్ కి ఛాన్స్ ఇచ్చాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఆంధ్రావాలా డిజాస్టర్. ఈ కాంబినేషన్ కి అదో చేదు అనుభవం. స్క్రిప్ట్ ని నమ్మిన ఎన్టీఆర్ పూరితో చేతులు కలిపాడు.
కట్ చేస్తే 2015లో విడుదలైన టెంపర్ సూపర్ హిట్. అవినీతి పరుడైన పోలీస్ పాత్రలో అద్భుతం చేశాడు. చాలా కొత్తగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ని పూరి జగన్నాధ్ డిజైన్ చేశాడు. టెంపర్ తో పూరి జగన్నాధ్ కెరీర్ కి కొంత మైలేజ్ దక్కింది.
సుకుమార్
దర్శకుడు సుకుమార్ వన్ నేనొక్కడినే చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించాడు. మహేష్ హీరోగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లే తికమక పెట్టింది. వెరసి వన్ నేనొక్కడినే డిజాస్టర్ అయ్యింది.
స్క్రిప్ట్ నచ్చడంతో ఎన్టీఆర్ సుకుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా నాన్నకు ప్రేమతో చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అందుకుంది. సుకుమార్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది.
కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ
రచయితగా ఉన్న కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ పవర్ మూవీతో దర్శకుడిగా మారాడు. రవితేజ హీరోగా నటించిన పవర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి స్టోరీ స్వయంగా పవన్ కళ్యాణ్ సమకూర్చారు. మాటలు సాయి మాధవ్ బుర్రా అందించారు.
సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వరుసగా రెండు ప్లాప్స్ ఇచ్చిన బాబీకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. కెరీర్లో మొదటిసారి ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశాడు. అదే జై లవకుశ మూవీ. 2017లో విడుదలైన జై లవకుశ సూపర్ హిట్ అందుకుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్
త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అజ్ఞాతవాసి ఓ చేదు అనుభవం. పవన్ కళ్యాణ్ 25వ చిత్రంగా తెరకెక్కిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యింది. రెండో రోజే సినిమా వసూళ్లు పడిపోయాయి. దానికి తోడు కాపీ ఆరోపణలు. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కథను కాపీ చేసి అజ్ఞాతవాసి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అజ్ఞాతవాసి తో త్రివిక్రమ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.
అయోమయంలో పడిన త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ టైం వీరి కాంబోలో అరవింద సమేత వీరరాఘవ టైటిల్ తో మూవీ విడుదలైంది. ఫ్యాక్షన్ కథకు తనదైన రొమాన్స్ జోడించి త్రివిక్రమ్ కొత్తగా తీశాడు. అరవింద సమేత సూపర్ హిట్ కొట్టింది.
కొరటాల శివ
పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివకు ఆచార్య రూపంలో డిజాస్టర్ ఎదురైంది. చిరంజీవి-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య డబుల్ డిజాస్టర్ అని చెప్పాలి. కనీస వసూళ్లు రాలేదు. ప్రేక్షకులు పూర్తిగా ఆచార్యను తిరస్కరించారు. ఆచార్య కారణంగా కొరటాల శివ ఆర్థికంగా కూడా నష్టపోయాడనే కథనాలు వెలువడ్డాయి.
ఆచార్య ఫలితం నేపథ్యంలో చిరంజీవి ఒకటి రెండు సందర్భాల్లో కొరటాల శివపై పరోక్ష విమర్శలు చేశాడు. కొరటాలతో గతంలో జనతా గ్యారేజ్ మూవీ చేసిన ఎన్టీఆర్... ఆయన ప్రతిభను నమ్మారు. మరోసారి ఛాన్స్ ఇచ్చారు. పాన్ ఇండియా చిత్రంగా దేవర ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తెరకెక్కింది.
సెప్టెంబర్ 27న విడుదలైన దేవర బ్లాక్ బస్టర్ దిశగా వెళుతోంది. రూ. 400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన దేవర... మొదటిరోజే రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక రెండు రోజులకు దేవర రూ. 244 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు తెలియజేశారు. కొరటాలకు ఏకంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా హిట్ ఇచ్చాడు..