నాని తెలంగాణ సింగరేణి నేపథ్యంలో రూపొందుతున్న` దసరా` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన వాడిన బూతు పదం ఇప్పుడు వివాదంగా మారుతుంది. దీంతో నాని ట్రోల్స్ కి గురవుతున్నారు.
నేచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో అలరిస్తున్నారు. దీంతో ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే హీరోగా పేరుంది. కానీ ఇటీవల ఆయన సినిమాలు రొటీన్ ఫీలింగ్‌ని తెప్పిస్తున్నాయి. ఆయన గత చిత్రం `అంటే సుందరానికి` అలాంటి కామెంట్లని ఎదుర్కొంది. ఆ సినిమా బోల్తా కొట్టింది. అయితే తన పంథాని మార్చి సినిమాలు చేస్తున్నారు నాని. `శ్యామ్ సింగరాయ్`తోనే ఓ ప్రయోగం చేశాడు. కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు `దసరా`తో పూర్తిగా ట్రాన్ఫ్సమేషన్ చూపిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సింగరేణి బొగ్గు గనుల మధ్య సాగే కథతో వస్తున్నాడు.
ఇందులో నాని పూర్తిగా తెలంగాణ కుర్రాడిగా కనిపించబోతున్నారు. తెలంగాణ యాసలోనూ మాట్లాడుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఆయన తెలంగాణలోనే డైలాగ్‌లు చెప్పి మెప్పించారు. దీనికి విశేష స్పందన లభించింది. అయితే ఈ సినిమా టీచర్‌లో వచ్చిన `బాంఛత్` అనే పదం హైలైట్‌గా, హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ ఈ పద ప్రయోగం పట్ల హ్యాపీగా ఉన్నారు. బోల్డ్ అండ్ డేర్‌నెస్‌కి కేరాఫ్‌గా భావిస్తున్నారు. నాని వంటి క్లాస్ హీరో నుంచి ఇలాంటి మాస్ డైలాగ్ వినడం కొత్తగా ఉందని దాన్నిహైలైట్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆ పదం వివాదంగా మారుతుంది. సినిమాల్లో ఆ పదం వాడకాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టడం లేదు, కానీ దాన్ని వాడాలని నాని చెప్పడమే ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీస్తుంది. సోమవారం ఈ చిత్రంలోని `ఓరి వారి` అనే పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మీడియా ప్రతినిధి ఒకరు `బాంఛత్` అనే పదాన్ని ఎలా వాడతారు, మీ సినిమా చూసే పిల్లలు దాన్ని ఉపయోగించే ప్రమాదం ఉంది కదా అని ప్రశ్నించగా, దాన్ని నాని సమర్దించుకోవడం విశేషం.
అందులో తప్పు లేదు అని అది జనసామాన్యంలో ఉన్న పదమే అని దాన్నే సినిమా లో వాడామని సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. అక్కడితో ఆగకుండా అది బూతు పదాన్ని అందరూ వాడాలని, ఆ పదాన్ని స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవాలని విచిత్రమైన వాదన తెరలేపారు. సినిమాలో నాని చేసిన పాత్ర ఒక బొగ్గుగనుల్లో పని చేసే కార్మికుడిది. ఆ పాత్ర రూపకల్పనలో భాగం గా ఆలా మాట్లాడింది అంటే అది వేరే విషయం, కానీ నాని ఆ విషయాన్ని సమర్ధించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు చర్చగా మారింది. అది జనం లో ఉన్నపదమే కావొచ్చు కానీ అది సోదరిని ఉద్దేశించి మాట్లాడే ఒక రాయలేని తిట్టు అని నానికి తెలియదు అంటే నమ్మే విషయమేనా అని అంటున్నారు నెటిజన్లు.
గతంలో `అర్జున్ రెడ్డి` చిత్రం లో తల్లిని ఉద్దేశించి తిట్టి ఆ సినిమా కి అదే ఒక పబ్లిసిటీ పాయింట్ గా మార్చి ఒక చీప్ స్ట్రాటజీ ని అప్లై చేసినట్టు ఇప్పుడు నాని కూడా చేస్తున్నట్టు ఎందుకు భావించకూడదు. పైగా ప్రెస్ మీట్ లో పదే పదే అదే పదాన్ని నాని ఉచ్చరించటం సమర్ధించుకోవడం సినిమా టీజర్ లో అంతగా హైలైట్ కానీ ఒక బూతు పదాన్ని ఇప్పుడు కావాలని హైలైట్ చేసినట్టు కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు క్రిటిక్స్. దీంతో ఇప్పుడు నాని ట్రోల్‌కి గురవుతున్నారు. కొందరు ఆయన్ని సమర్ధించినా, మరికొంత మంది మాత్రం ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం తెలియజేయడం గమనార్హం. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది, దీనిపై నాని స్పందిస్తారా? అనేది చూడాలి.
నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించిన `దసరా` చిత్రానికి శ్రీకాంత్ ఓడెలా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. నాని చేస్తున్న ప్రాపర్ పాన్ ఇండియా మూవీ.
