కోలీవుడ్‌ స్టార్‌ సూర్య సోదరుడు, హీరో కార్తి మరోసారి తండ్రి అయ్యాడు. ఆయనకు మంగళవారం సాయంత్రం పండంటి మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని కార్తి సోషల్‌ మీడియా అకౌంట్‌ అయిన ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. ఈ లైఫ్‌ ఛాలెంజింగ్‌ ప్రాసెస్‌లో సహకరించిన వైద్యులు, నర్సులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తన మగబిడ్డకు అందరు ఆశిస్సులు కావాలని కోరుకున్నాడు. 

కార్తికి రంజనితో 2011లో వివాహం జరిగింది. 2013లో వీరికి కూతురు ఉమయాల్‌ జన్మించారు. ఏడేళ్ళ తర్వాత మరో సారి కార్తి తండ్రి అయ్యారు. ఇక నటుడు శివకుమార్‌ కుమారిడిగా, సూర్య సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేసిన కార్తి మణిరత్నం దర్శకత్వం వహించిన `ఆయుత ఎజుతు`(తెలుగులో యువ) చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు కార్తి. 

2007లో `పరుథివీరన్‌` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది తెలుగు `మల్లీగాడు`గా విడుదలైంది. ఆ తర్వాత `ఆయిరథిల్‌ ఒరువన్‌` చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇది తెలుగులో `యుగానికి ఒక్కడు`గా విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్‌ హీరోగా రాణిస్తున్న కార్తి `సుల్తాన్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.