ఇష్టంతో చేసే పని బయటకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు హీరో గోపీచంద్. తన సహాయం పొందినవాళ్లలో కొందరికి ఆయన పేరు కూడా తెలియదట.
హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా. శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల చేస్తున్నారు. భీమా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న గోపీచంద్ తాను కొందరిని చదించినట్లు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ... ఇష్టంతో చేసే పని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నా శక్తిమేర నేను కొందరిని చదివించాను. వాళ్లలో కొంతమంది ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. కొంత మందికి అసలు నా పేరు కూడా తెలియదు.
చదువుకునే ఆసక్తి ఉన్నప్పుడు దానికి డబ్బు అడ్డం కాకూడదు. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా సహాయం చేస్తాను.నా చిన్నతనంలో ఒంగోలులో మాకు ఒక స్కూల్ ఉండేది. నాన్న దాన్ని ఎంతో ఇష్టంగా నడిపారు. అయితే ఆయన మరణం తర్వాత ఆ స్కూల్ ని మేము నడపలేకపోయాము. ఆ విషయం బాధిస్తుంది... అన్నారు. గోపీచంద్ మంచి మనసుకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయం చేస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదని గోపీచంద్ చెప్పకనే చెప్పాడు.
కాగా భీమా చిత్రాన్ని అఖండ చిత్రంతో పోల్చుతున్న నేపథ్యంలో గోపీచంద్ ఖండించారు. అఘోరాలు ఉన్నంత మాత్రాన అఖండ, భీమా ఒకటి కాదు. మాది వేరే సబ్జెక్టు అని అన్నారు. ఏ హర్ష భీమా చిత్ర దర్శకుడు. గోపీచంద్ కి జంటగా ప్రియ భవాని శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఒక్క హిట్ అంటూ గోపీచంద్ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఆయనకు సక్సెస్ దక్కడం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన పక్కా కమర్షియల్, రామబాణం ఘోరంగా దెబ్బతిన్నాయి. కనీస వసూళ్లు రాబట్టలేదు. భీమా హిట్ కావడం గోపీచంద్ కి చాలా అవసరం. ఈ చిత్రంపై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నారు.
