అవికా గోర్, శ్రీరామ్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం టెన్త్ క్లాస్ డైరీస్. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల కాగా ఆసక్తి రేపుతోంది. 

టెన్త్ క్లాస్ డైరీస్ జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. కాగా నేడు టెన్త్ క్లాస్ డైరీస్ ట్రైలర్ విడుదల చేశారు. కోలీవుడ్ హీరో ధనుష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. ఇక రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. టెన్త్ క్లాస్ డైరీస్ సస్పెన్సు ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. శ్రీరామ్, అవికా క్లాస్ మేట్స్. స్కూల్ డేస్ లోనే వీరి మధ్య ప్రేమ పుడుతుంది. 

ఇది అమ్మాయి ఇంట్లో తెలిసి గొడవలు జరుగుతాయి. తర్వాత శ్రీరామ్ కెరీర్ కోసం విదేశాలకు వెళ్ళిపోతాడు. అవికా ఇండియాలో తనకు నచ్చిన ట్రావెలింగ్ లైఫ్ అనుభవిస్తుంది. కొన్నేళ్ల తర్వాత శ్రీరామ్ స్కూల్ టైం ప్రేయసి అవికాను వెతుక్కుంటూ ఇండియాకి వస్తాడు. ఆమెను కలుసుకోవాలి అనుకుంటాడు. అప్పుడే అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. అసలు అవికా ఎక్కడుంది? ఆమెకు ఏమైంది? శ్రీరామ్ ఆమెను కలిశాడా? అనేదే టెన్త్ క్లాస్ డైరీస్ మూవీ కథగా అర్థం అవుతుంది. 

ట్రైలర్ లోనే దర్శకుడు కథ చెప్పేశాడు. ట్రైలర్ ఆసక్తి కలిగిస్తుంది. గరుడవేగ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేసిన అంజి ఈ మూవీతో డైరెక్టర్ గా మారుతున్నాడు. శివ బాలాజీ, శ్రీనివాసరెడ్డి, నాజర్, హిమజ కీలక రోల్స్ చేశారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అచ్చుత్ రామారావు, రవితేజ మన్యం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.