హీరో చిరంజీవికి మోకాలి సర్జరీ జరగనుందని సమాచారం. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. చిరంజీవి ఇందుకు సిద్దమవుతున్నారట.  

ఏడు పదుల వయసు దగ్గరపడుతుండగా మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన నాలుగు సినిమాలు విడుదల చేయడం విశేషం. ఒక స్టార్ హీరో ఇంత వేగంగా సినిమాలు చేయడం గొప్ప విషయం. గత ఏడాది ఏప్రిల్ లో ఆచార్య రిలీస్ కాగా అక్టోబర్ లో గాడ్ ఫాదర్, 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య చిత్రాలు వచ్చాయి. తాజాగా భోళా శంకర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. 

విరామం లేకుండా పని చేస్తున్న చిరంజీవి మోకాలి గాయంతో బాధపడుతున్నారట. వైద్యులు సర్జరీ సూచించారట. దీంతో చిరంజీవికి మోకాలి సర్జరీ జరగనుందంటూ కథనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ లేదా విదేశాల్లో చిరంజీవికి సర్జరీ జరగనుందట. సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్నాక నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారట. 

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో చిరంజీవి ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ వీరి కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యిందంటున్నారు. మలయాళ హిట్ బ్రో డాడీ రీమేక్ గా ఇది తెరకెక్కనుందట. చిరంజీవితో పాటు శర్వానంద్ ఈ చిత్రంలో నటిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మిస్తారట. ఇది కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. 

అయితే భోళా శంకర్ డిజాస్టర్ కాగా చిరంజీవి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇకపై రీమేక్స్ చేయకండని ఫ్యాన్స్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి బ్రో డాడీ రీమేక్ పక్కన పెట్టే అవకాశం కలదంటున్నారు. మరి చూడాలి చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారో...