మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మొదటివారం ముగిసే నాటికి ఉప్పెన రూ. 70కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతున్న ఉప్పెన, యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి అందం, నటుడు విజయ్ సేతుపతి నటన సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి. 


అలాగే దర్శకుడు బుచ్చి బాబు ఎంచుకున్న ప్రేమ కథ, దానికి ఇచ్చిన ఊహించని ముగింపు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ఉప్పెన విజయంతో బుచ్చి బాబు సానా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక టాలీవుడ్ ప్రముఖుల కోసం ఉప్పెన స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో నిన్న నటసింహం బాలకృష్ణ కుటుంబంతో పాటు ఉప్పెన చిత్రాన్ని వీక్షించారు. 

ఉప్పెన చిత్రం అద్భుతంగా ఉందన్న బాలకృష్ణ, దర్శక నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించారట. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. స్పెషల్ స్క్రీనింగ్ కి వచ్చిన బాలకృష్ణతో బుచ్చి బాబు సానా ఫోటోకి పోజిచ్చారు. మరోవైపు బుచ్చి బాబుకు టాలీవుడ్ నుండి బడా బడా ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.