అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఆయన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
అల్లరి నరేష్ కి అర్జెంటుగా హిట్ కావాలి. కామెడీ చిత్రాల హీరోగా ఒకప్పుడు ఆయన వరుస హిట్స్ ఇచ్చారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే స్టార్ ని చేసిన అదే కామెడీ జోనర్ ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం కూడా చూపింది. మూసధోరణి పెరిగి జనాలకు అల్లరి నరేష్ సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది. సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ కి హిట్ లేదు. నాంది పర్లేదు అనిపించుకుంది. ఏదైనా కానీ ఇకపై కామెడీ చిత్రాలు వద్దని నరేష్ డిసైడ్ అయ్యారు. నా పేరు నుండి అల్లరి తీసేస్తున్నా అంటూ ప్రకటించారు.
వరుసగా సీరియస్ కంటెంట్ ఉన్న చిత్రాలు ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఉగ్రం అంటూ ప్రేక్షకులను పలకరించనున్నారు. మే 5న ఉగ్రం మూవీ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న అల్లరి నరేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉగ్రం షూటింగ్ లో అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు.
అడవిలో షూట్ చేసిన ఒక ఫైట్ లో స్మోక్ మెషిన్స్ పెట్టారట. దానికి తోడు సిగరెట్ తాగుతూ రావాలని డైరెక్టర్ చెప్పాడట. ఆ ఎపిసోడ్ కోసం అల్లరి నరేశ్ నాలుగు రోజుల్లో దాదాపు ఐదారు వందల సిగరెట్లు కాల్చారట. దాంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతిందని అల్లురి నరేష్ చెప్పుకొచ్చారు. ఉగ్రం సినిమా కోసం యూనిట్ తో పాటు అందరూ కష్ట పడినట్లు చెప్పుకొచ్చారు.
అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ శివ కుమార్ గా నటిస్తున్నారు. మిస్సింగ్ కేసులు ప్రధాన ఉదంతంగా ఉగ్రం తెరకెక్కింది. విజయ్ కనకమేడల దర్శకుడిగా ఉన్నారు. గతంలో వీరి కాంబోలో నాంది తెరకెక్కింది. ఇది రెండో చిత్రం. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు.
