ఒకప్పుడు 'ఆనందం' వంటి హిట్ సినిమాల్లో నటించిన హీరో ఆకాష్ ఆ తరువాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాడు. ఇండస్ట్రీలో కాంపిటిషన్ పెరగడంతో ఆకాష్ సైడైపోయాడు. అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే సడెన్ గా దర్శకుడు పూరి తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కథ తనదంటూ వార్తల్లోకెక్కాడు. 
ఈ క్రమంలో ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడంతో పాటు కమెడియన్ సునీల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆకాష్ హీరోగా నటించిన 'పిలిస్తే పలుకుతా' సినిమాలో సునీల్ కమెడియన్ పాత్ర పోషించాడు. ఆ పరిచయంతో సునీల్ కి హీరోగా 'అందాల రాముడు' ఛాన్స్ వచ్చిన సమయంలో ఆకాష్ కి ఫోన్ చేసి 'భయ్యా నేనో సినిమా చేస్తున్నా.. మీరు అందులో ఒక క్యామియో  చేయాలని' రిక్వెస్ట్ చేశాడట. తన పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని ఆకాష్ సందేహం వ్యక్తం చేస్తే.. క్యారెక్టర్ ని డెవలప్ చేయిస్తానని చెప్పాడట.

దీంతో ఆకాష్ హీరోగా ఓ సినిమా ఛాన్స్ వదులుకొని 'అందాల రాముడు'లో సెకండ్ హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడట.షూటింగ్ జరిగిన సమయంలో ఆకాష్ దగ్గరకు రోజూ సునీల్ వచ్చి చేతులు పట్టుకొని 'ఇవి కాళ్లు అనుకో భయ్యా.. నువ్ చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను' అనేవాడట. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత ఒక్క పోస్టర్ లో కూడా తన ఫోటో లేదని.. తన పాత్రకు ఉండే ఒక పాట కూడా లేకుండా చేశాడని.. ప్రమోషన్స్, ఈవెంట్స్ లో తన పేరు ఒక్కసారి కూడా చెప్పలేదని.. సునీల్ తీరుతో చాలా బాధ పడినట్లు తెలిపాడు. 

సునీల్ కి కృతజ్ఞత లేదని అన్నాడు. అంతేకాదు.. సునీల్ తో కలిసి 'నవవసంతం' సినిమా చేస్తోన్న సమయంలో తనను చిన్నచూపు చూసేవాడని.. అప్పటివరకు భయ్యా అని పిలిచే సునీల్ పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టాడని తెలిపాడు. ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని సునీల్ ని సంప్రదిస్తే చేయనని మొహం మీదే చెప్పేశాడని.. సునీల్ నిజస్వరూపం తెలిసి చాలా హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చాడు.