సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడప్పుడే టాలీవుడ్ లో హీరోగా ఎదుగుతున్నాడు. అలాంటి సమయంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మహేష్ తో మురారి చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలై దాదాపు 18 ఏళ్ళు గడిచిపోతోంది. మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువ చేసిన చిత్రం ఇది. మహేష్, సోనాలి బింద్రే మధ్య కెమిస్ట్రీ కూడా యువతని ఆకట్టుకుంది. 

ఇటీవల కృష్ణవంశీ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సంధర్భంగా మురారి చిత్ర ప్రస్తావన వచ్చింది. మా బాస్ మహేష్ తో మురారి 2 తీయండి సర్ అని ఓ నెటిజన్ కృష్ణవంశీని అడిగారు. దీనికి కృష్ణవంశీ తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. రెండో మురారి ఉండదు.. ఒకే ఒక్క మురారి అంతే అని కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు. 

నిన్నే పెళ్లాడతా, మురారి చిత్రాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను..  ఆ రెండూ నాకు ఇష్టమైన చిత్రాలే అని కృష్ణవంశీ సమాధానం ఇచ్చాడు. మరోనెటిజన్ మీ నుంచి చక్రం లాంటి సినిమా ఆశించొచ్చా అని ప్రశ్నించాడు. అది పెద్ద డిజాస్టర్ అంటూ కృష్ణవంశీ బదులిచ్చాడు. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. టీవీల్లో వచ్చాక ప్రేక్షకులు అందరించారు. కృష్ణవంశీ ప్రస్తుతం వందేమాతరం అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2020లో విడుదల కానుంది.