గత ఏడాది చివరాంతంలో విడుదల అయిన అఖిల్ సినిమా ‘హలో’ రూపకర్తలకు లీగల్ నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సినిమాలో తన ఫోన్ నంబర్ ను వాడుకోవడంపై గుర్గావ్ కు చెందిన వికాస్ ప్రజాపతి అనే వ్యక్తి ‘హలో’ నిర్మాతలకు ఈ నోటీసులు పంపించినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ కు తన ఫోన్ నంబర్ వాడారు అని వికాస్ చెబుతున్నాడు. ఆ ఫోన్ నంబర్ ను తెరపై చూపడంతో.. తనకు లెక్కకు మించి కాల్స్, మెసేజ్ లు వచ్చాయని వికాస్ అంటున్నాడు.

 

ఓ కంప్యూటర్ ఆపరేటర్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్. అదీ మామూలుగా కాదు. పెళ్లి చేసుకుంటామనే రేంజిలో... నెల రోజుల నుంచి‘హాయ్.. నేను నీ అభిమానిని’, ‘నీతో ఒకసారి మాట్లాడొచ్చా..’, ‘ఐ లవ్యూ..నిన్ను పెళ్లి చేసుకుంటా..’ అంటూ మొదలుపెట్టి.. కొన్ని వందల, వేల మెసేజ్ లు వస్తున్నాయి. వీటితో పాటు ఇదే తరహా సందేశాలతో ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయట. ఉన్నట్టుండి తనకు ఆ మేసేజ్ లు ఎందుకు వస్తున్నాయో.. వికాస్ కు అర్థం కాలేదట. కానీ.. తర్వాత విచారిస్తే.. తన ఫోన్ నంబర్ ను హలో సినిమాలో ఉపయోగించారని అతడికి అర్థమైంది.

 

అందులోనూ.. ఆ సినిమాలో హీరోయిన్ నంబర్ గా తన నంబర్ ను చూపించారని, దీంతో.. వరస పెట్టి కాల్స్ వస్తున్నాయని వికాస్ చెబుతున్నాడు. ఏదో ఒకటీ రెండు కాల్స్ కాదు.. హలో సినిమాను చూసి, అందులో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కు ఫిదా అయిన వాళ్లంతా వికాస్ నంబర్ కు కాల్స్ చేస్తున్నారట. దీంతో తనకు ఇదంతా ఒక టార్చర్ గా మారిందని వికాస్ చెబుతున్నాడు.

 

దీంతో తను చాలా నష్టపోయాను అని, ఫోన్ నంబర్ ను మార్చేద్దామా.. అనుకుంటే, అది తన స్నేహితులందరికీ ఈ నంబరే ఇచ్చుకున్నాను అని, ఐదు సంవత్సరాలుగా అనేక మందికి ఈ నంబర్ ను ఇచ్చుకోవడంతో ఇప్పుడు మార్చడం ఇబ్బందిగా మారిందని వికాస్ చెబుతున్నాడు. తను పడిన ఈ ఇబ్బందికి గానూ.. యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతున్నాడితను. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించాడితను.​

 

అయితే తాము అనుమతి తీసుకున్నామని.. ఈ నంబర్ ప్రొవైడర్ల నుంచి అనుమతితో సినిమాలో వాడుకున్నామని ‘హలో’ నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆ సంస్థ మాత్రం ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని చెబుతుండటం గమనార్హం.