ముగిసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ఎంపీ వివేక్ హెచ్ సీఏ కార్యదర్శిగా శేష్ నారాయణ ఏకగ్రీవ ఎన్నిక

హెచ్‌సీఏ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి. వివేకానంద్‌ వర్గం క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆరు స్థానాల్లో ఘన విజయం సాధించింది. హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా వివేక్‌ ఎన్నికయ్యాడు. శుక్రవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తన ప్రత్యర్థి, మాజీ క్రికెటర్‌ విద్యుత జయసింహపై 67 ఓట్లతేడాతో విజయం సాధించారు. వివేక్‌కు 136 ఓట్లు రాగా, విద్యుతకు కేవలం 69 ఓట్లే వచ్చాయి. కార్యదర్శిగా టీ. శేష్‌ నారాయణ, ఉపాధ్యక్షుడిగా అనిల్‌ కుమార్‌, కోశాధికారిగా మహేందర్‌, సంయుక్త కార్యదర్శిగా అజ్మల్‌ అసద్‌, ఈసీ సభ్యుడిగా హనుమంత రెడ్డి ఎన్నికయ్యారు. ఆరుగురు ఆఫీస్‌ బేరర్లతో కూడిన ఈ నూతన కార్యవర్గం మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనుంది.

పురుష, మహిళా క్రికెట్‌ నుంచి ఒక్కొక్కరిని సంఘం కార్యవర్గానికి నామినేట్‌ చేస్తారు. జనవరి 17న జరిగిన ఎన్నికల్లో కార్యదర్శి పోటీలో టి. శేష్‌ నారాయణ ఒక్కడే బరిలో నిలవడంతో అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్‌కు 138 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఇమ్రాన్‌ మహమూద్‌ 86 ఓట్లు దక్కించుకున్నాడు. సంయుక్త కార్యదర్శి బరిలో నిలిచిన వంకా ప్రతాప్ కు నిరాశే ఎదురైంది. అతను అజ్మల్‌ అసద్‌ చేతిలో ఓడిపోయాడు. ప్రతాప్ కు 80 ఓట్లు రాగా, 124 ఓట్లు దక్కించుకున్న అజ్మల్‌ అసద్‌ గెలుపొందాడు. కోశాధికారిగా వివేక్‌ ప్యానెల్‌ అభ్యర్థి పి. మహేందర్‌ 148 ఓట్లు సాధించగా.. అతని ప్రత్యర్థి అనూరాధ కేవలం 54 ఓట్లకే పరిమితం అయింది. ఈసీ సభ్యుడిగా ఎన్నికైన హన్మంత రెడ్డికి వంద ఓట్లు వచ్చాయి. ఈ పదవికి మరో ఐదుగురు పోటీ పడగా.. హన్మంత రెడ్డికి అత్యధికంగా ఓట్లు వచ్చాయి.

నిజానికి జనవరి 17నే ఈ ఎన్నికలు జరగ్గా, హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపును వాయిదా వేశారు. తిరిగి న్యాయస్థానం గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అడ్వకేట్‌ కమిషనర్‌ రాజీవ్‌ రెడ్డి సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకూ సాగింది. కౌంటింగ్ పూర్తి చేసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.