తెలుగులో సైతం సంచలన విజయం నమోదు చేసిన  చిత్రం 'కేజీఎఫ్‌'.  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రంలో యంగ్ హీరో యష్ నటించారు. ట్రైలర్‌తోనే భారీగా హైప్ క్రియేట్ అయిన ‘కేజీఎఫ్’రిలీజ్  తర్వాత ఎక్సపెక్టేషన్స్ మించి విజయం సాధించింది. కన్నడంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ బాక్సాఫీసును కుదిపేస్తోంది. 

ఈ చిత్రం విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్న హీరో యశ్ కు , ఆయన  కుటుంబానికి న్యాయ పోరాటంలో చుక్కెదురైంది. అద్దె ఇంటి మరమ్మతుకు చేసిన రూ.12.50  లక్షలను అద్దె కింద పరిగణించాలన్న యశ్‌ తల్లి పుష్ప పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దల కుట్ర వల్లే  వివాదం ఇంత రచ్చకెక్కిందని పుష్ప ఆవేదన చేసారు.  

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగుళూరు బనశంకరి మూడవస్టేజీలోని ఆరవ బ్లాక్‌లో యశ్‌ కుటుంబం అద్దె ఇంటిలో ఉంటోంది. బాకీ పడిన అద్దెను చెల్లించి ఇంటినీ ఖాళీ చేయాలని ఇంటి యజమానులు మునిప్రసాద్, వనజా దంపతులు.. యశ్‌ కుటుంబాన్ని కోరారు. అయితే అద్దె ఇవ్వకుండా, ఖాళీ చేయకుండా యశ్‌ తల్లి ఎ.పుష్ప ఉండిపోయారని యజమానులు ఆరోపిస్తున్నారు.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే...ఇంటిని రిపేరు చేయించిన ఖర్చును అద్దెలో లెక్కించాలని యశ్‌ కుటుంబం హైకోర్టులో అర్జీ వేసింది. కేసును విచారించిన హైకోర్ట్‌  ధర్మాసనం అద్దె ఇవ్వకుండా, ఖాళీ చేయకుండా ఎలా ఉంటారని యశ్‌ కుటుంబాన్ని ప్రశ్నించింది. అద్దె బకాయిలను చెల్లించి మార్చి లోపు ఇంటిని ఖాళీ చేయాలని యశ్‌ తల్లికి గడువు ఇచ్చింది. అద్దెను డిడి రూపంలో యజమానుల పేరుతో ఉమ్మడిగా చెల్లించి మార్చి  31లోపు ఖాళీ చేయాలని స్పష్టంచేసింది. కోర్టు ఆదేశాల మేరకు రూ.23 లక్షలను చెల్లించటానికి యశ్‌ తల్లి అంగీకరించారు. 2010  నుండి నెలకు రూ.40 వేలు చొప్పున బాడుగకు యశ్‌ కుటుంబం అక్కడ నివాసముంటోంది.  

ఈ నేపధ్యంలో యశ్ తల్లి మాట్లాడుతూ.. ఈ వివాదం పెద్దది కావడం వెనుక చిత్రరంగానికి చెందిన పెద్దల ప్రమేయం ఉందని అమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తారనుకోలేదని అన్నారు.