సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. '1 నేనొక్కడినే' సినిమా తరువాత మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు.

సాధారణంగా సినిమా టైటిల్స్ ని ప్రొడక్షన్ హౌస్ పేరిట రిజస్తర్ చేయిస్తారు. కానీ మహేష్-సుకుమార్ ల సినిమా టైటిల్ గోప్యంగా ఉంచడం కోసం సుకుమార్ తన దగ్గర కో డైరెక్టర్ గా పని చేసే వ్యక్తి ద్వారా టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

సదరు కో డైరెక్టర్ రిజిస్టర్ చేయించిన టైటిల్ 'హర హర శంభో శంకర'. ఇటువంటి ఆధ్యాత్మిక టైటిల్ ని మహేష్ సినిమా కోసం రిజిస్టర్ చేయించడంతో సినిమా అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇటీవల మీడియా ముందుకొచ్చిన సుకుమార్.. మహేష్ తో సినిమా ఉంటుందని మే నెలలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు.

కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మహేష్ 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.