అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటించిన రెండో చిత్రం `గుంజన్‌ సక్సేనా` బుధవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ముఖ్యంగా జాన్వీ నటనకు మంచి పేరొస్తుంది. కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ గుంజన్‌ సక్సేనాగా ఆమె అభినయం మంత్రముగ్ధుల్ని చేసిందని బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా గ్రీక్‌ వీరుడు హృతిక్‌ రోషన్‌, మరో యంగ్‌ హీరో సిద్ధార్థ మల్హోత్రా స్పందించి జాన్వీపై ప్రశంసలు కురిపించారు. 

హృతిక్‌ ట్విట్టర్‌ ద్వారా `గుంజన్‌ సక్సేనా` సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. `ఇప్పుడే `గుంజన్‌ సక్సేనాః ది కార్గిల్‌ గర్ల్ ` సినిమా చూశా. ఆహా.. ఏమీ సినిమా. బాగా కన్నీళ్ళు పెట్టించింది. అంతేకాదు గట్టిగా నవ్వించింది. టీమ్‌ అందరికి టేక్‌ ఏ బౌ. అత్యుత్తమమైన సినిమా` అని ప్రశంసల జల్లు కురిపించారు. 

మరోవైపు యంగ్‌ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా చెబుతూ, `గుంజన్‌ అత్యంత నిజమైన ఇన్ స్పైరింగ్‌ స్టోరీ. జాన్వీ ఇందులో గుంజన్‌గా ఓ నిజాయితీ గల నటనని ప్రదర్శించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పాత్రని పోషించింది. ఆమె పాత్రని అందరు ప్రేమిస్తారు, బాగా కనెక్ట్ అవుతారు. పంకజ్‌ త్రిపాఠి సర్‌ అద్బుతంగా నటించారు. తండ్రి కూతుళ్లుగా ఇద్దరు బాగా చేశారు. దర్శకుడు శరణ్‌ తొలి చిత్రం అద్భుతంగా ఉంది. టీమ్‌ అందరికి అభినందనలు` అని తెలిపారు. వీరితోపాటు సినీ విశ్లేషకులు సైతం ఈ స్ఫూర్తివంతమైన దేశభక్తి చిత్రాన్ని అభినందిస్తున్నారు.

గుంజన్‌ సక్సేనాగా జాన్వీ కపూర్‌ నటించిన ఈ సినిమాకి శరణ్‌ శర్మ దర్శకత్వం వహించగా, ఇది బుధవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మొదట మిశ్రమ స్పందన రాబట్టుకున్నా, ఇప్పుడు క్రమంగా తారల ప్రశంసలతో పుంజుకుంటోంది.