హాస్య నటుడు.. స్వశక్తితో ఎదిగిన గుండు హనుమంతరావు ఇక లేరు. నాటక రంగం మీద ఉన్న ఇష్టంతో మొదలైన ఆయన ప్రయాణం నేటితో ఆగిపోయింది.400 వందలకు పైగా సినిమాలు.. పలు టీవీ షోలతో  తెలుగు ప్రజల్ని తన హాస్యంతో నవ్వులు పూయించిన గుండు హనుమంతరావు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో శాశ్విత నిద్రలోకి జారిపోయారు.

61 ఏళ్ల గుండు హనుమంతరావు హైదరాబాద్ ఎర్రగడ్డలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధ పడుతున్నారు. అయినప్పటికీ ఆయన తన అనారోగ్యం గురించి బయటకు చెప్పుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ఆత్మాభిమానం చంపులేక ఎవరినీ చేయి చాచి సాయం అడగలేదు. అయితే.. మీడియాలో వచ్చిన వార్తతో స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయాన్ని అందించారు. 

విజయవాడలో 1956లో జన్మించిన గుండు హనుమంతరావు నాటకాల మీద ఉన్న ఇష్టంతో 18 ఏళ్ల వయసులో నాటక రంగంలోకి ప్రవేశించారు. రావణబ్రహ్మ వేషంతో ఆయన పాపులర్ అయ్యారు. దాదాపు 400 సినిమాల్లో ఆయన నటించారు. ఆయన నటించిన తొలిచిత్రం అహ నా పెళ్లంట చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్న గుండు.. తర్వాతి కాలంలో చాలా సినిమాల్లో నటించారు.

బాబాయ్ హోటల్.. పేకాట పాపారావు.. అల్లరి అల్లుడు.. మాయలోడు.. యమలీల.. శుభలగ్నం.. క్రిమినల్.. అన్నమయ్య.. సమరసింహారెడ్డి.. కలిసుందాం రా.. సత్యం.. భద్రత.. ఆట.. మస్కా.. పెళ్లాం ఊరెళితే లాంటి ఎన్నో సినిమాల్లో నటించి.. తన ఎక్స్ ప్రెషన్ తో నవ్వులు పూయించారు. పలు టీవీ సీరియల్స్ లో నటించిన ఆయన.. మూడు సార్లు టీవీ నందుల్ని గెలుచుకున్నారు. అమృతం సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. గుండు హనుమంతరావుకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో భార్య.. కుమార్తె గతంలోనే చనిపోయారు. గడిచిన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో సినిమాలకు దూరమయ్యారు. గుండు హనుమంతరావు మృతికి సినీ రంగ ప్రముఖులు పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు.