బాలీవుడ్‌ నటుడు గోవిందా ఇంట్లో ఖాళీగా కూర్చున్నారని, ఆయన సమకాలీన నటులు పని చేస్తున్నారని ఆయన భార్య సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీ ఆఫర్లను తిరస్కరించడం, 90ల నాటి శైలిలోనే ఉండిపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు. గోవిందా స్నేహితులను కూడా సునీత విమర్శించారు.

గోవిందా భార్య సునీత ఆహూజా మాట్లాడుతూ, తన భర్త ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉండటం బాధ కలిగిస్తోందని అన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం ప్రస్తావిస్తూ, గోవిందా వయసులో ఉన్న ఇతర నటులు ఇప్పటికీ పనిచేస్తున్నారని ఉదాహరణగా చూపించారు. త్వరలోనే గోవిందా పెద్ద తెరపై తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటీటీ వేదికల నుండి వస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు.

జూమ్ తో మాట్లాడుతూ, 'నేను ఎప్పుడూ గోవిందాతో నువ్వు లెజెండ్ స్టార్ అని చెబుతాను. నువ్వు 1990ల కాలపు రాజువి. నేటి పిల్లలు నీ పాటలకు డ్యాన్స్ చేస్తారు. మంచి కంపెనీ కోసం వెతకమని చెబుతూనే ఉంటాను. నీలాంటి లెజెండ్ ఎందుకు ఇంట్లో కూర్చోవాలి? అనిల్ కపూర్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ వంటి నీ వయసు నటులు బాగా పని చేస్తున్నారు. నువ్వు ఎందుకు పని చేయవు? మేము గోవిందాను సినిమాల్లో చూడటం మిస్ అవుతున్నాం` అని తెలిపారు.

గోవిందా పిల్లలు ఆయనను తెరపై చూడాలని ఆశపడుతున్నారు

సునీత మాట్లాడుతూ, "నా పిల్లలు ఆయనను తెరపై చూడాలని ఎంతో ఆశపడుతున్నారు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో వాళ్ళు ఏది సరైనదో చెప్పడం లేదు. అవునవును అంటూ వంత పాడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం మంచిది కాదు. ఆ మిత్రులకు నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, గోవిందా ఆర్థికంగా కూడా మీకు సహాయం చేశారు, మీరు ఆయనకు సరైన మార్గం ఎందుకు చూపించరు?"

గోవిందా కాలంతో పాటు మారడం లేదు : సునీత

గోవిందా సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం ఆయన కాలంతో పాటు మారడం లేదని, 1990ల నాటి శైలిలోనే ఇంకా ఉన్నారని సునీత అన్నారు. ఆ కాలంలో ఆయన సినిమాలు బాగా ఆడేవి. 90ల కాలం పోయింది. ఇప్పుడు 2025. 90ల నాటి సినిమాలు ఎవరూ చూడరు. ఆయన జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఆయన బరువు తగ్గమని, అందంగా కనిపించమని చెప్పండి.

ఇంత పెద్ద నటుడు ఇంట్లో కూర్చోవడం మాకు బాధ కలిగిస్తోంది. సినిమా పరిశ్రమలో నటులు తమ గురించి మంచిగా వినడానికి ఇష్టపడతారు. నిజం వినడానికి ఇష్టపడరు. 90లలో ప్రశంసలు లభించాయి. గోవిందా లాంటి నటుడు లేడు. కానీ ఆయన మంచి సినిమాలు చేయాలి, మంచి దర్శకులను ఎంచుకోవాలి. ఆయన అక్కడే ఓడిపోతున్నారు.

గోవిందాకి చెప్పి చెప్పి వదిలేశానుః సునీత

గోవిందా తన సలహా తీసుకోకపోవడంతో ఆయన పనిని నిర్వహించడం మానేశానని సునీత తెలిపారు. `నేను కొన్ని సంవత్సరాల క్రితం వరకు గోవిందా ని చూసుకునేదాన్ని. ఓటీటీలో పని చేయమని సలహా ఇచ్చాను. అక్కడ మంచి కథలు ఉన్నాయి. కానీ ఆయన నిరాకరించారు. 4-5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఓటీటీనే చూస్తారని నేను ఆయనతో అన్నాను. నేను కూడా అభిమానిని. 

ప్రతిరోజూ వేరే భాషలో ఒక సినిమా చూస్తాను. కానీ ఆయన పెద్ద తెరపైనే సినిమాలు చేయాలనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఆయన పనిని నిర్వహించడం లేదు. 38 సంవత్సరాలు నిన్ను భరించాను. నువ్వు వినవు. ఇప్పుడు ఎవరి మాట వింటున్నావో, వాళ్ళతో చేయించుకుని చూడు ఏం చేయగలరో` మండి పడింది సునీత. మరి ఈ మాటలతో నైనా గోవింద రియలైజ్‌ అవుతాడా? మళ్లీ సినిమాలు చేస్తాడేమో చూడాలి.