ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటివరకు ప్రముఖుల జీవిత కథలను సినిమాలుగా చూపించారు. ఇదే ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనూ నడుస్తోంది. ఇటీవలే మహానటి సావిత్రి జీవిత కథ తో ఓ సినిమా తెరకెక్కగా.. ఎన్టీఆర్ బయోపిక్ కూడా తెరకెక్కేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటి వరకు తెరకెక్కిన బయోపిక్ లు అన్నీ.. ప్రజల హృదయాల్లో ఎనలేని
ముద్ర వేసుకున్న వారివే. కానీ..  తొలిసారిగా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి..విదేశాల్లో సేదతీరుతున్న విజయ్ మాల్యా జీవితం ఆధారంగా కూడా ఓ సినిమా ని తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారు సెన్సార్‌ బోర్డు మాజీ చీఫ్‌, దర్శకుడు పహ్లజ్‌ నిహ్లానీ. ఈ విషయాన్ని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. రీల్‌ లైఫ్ మాల్యా పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవింద నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో గోవింద గెటప్‌ చూసి అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతారని తెలిపారు. బ్యాంక్‌ స్కాంల సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామన్నారు.

గతంలో నిహ్లానీ‌..గోవిందతో ‘రంగీలా రాజా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో గోవింద పాత్ర నచ్చి మాల్యా పాత్రకు ఎంపికచేసినట్లు తెలిపారు. గతవారం మాల్యా యజమానిగా వ్యవహరించిన ‘కింగ్‌ఫిషర్’ క్యాలెండర్‌పై ఓ పాటను కంపోజ్‌ చేశారట. ఈ పాటను చిన్ని ప్రకాశ్‌ కొరియోగ్రాఫ్‌ చేశారు. ‘గతంలో కంటే గోవింద ఇప్పుడే ఫిట్‌గా ఉన్నారు. చిన్ని ప్రకాశ్‌ కేవలం గోవింద వేయగలిగే స్టెప్పులనే కొరియోగ్రాఫ్‌ చేశారు’ అని నిహ్లానీ వెల్లడించారు. కాగా..మాల్యా గెటప్‌లో ఉన్న గోవింద లుక్‌ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అచ్చం మాల్యాలాంటి హెయిర్‌స్టైల్‌తో గోవింద ఆకట్టుకుంటున్నారు.

వివిధ బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా లండన్‌కు పారిపోయారు. అక్కడి వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం మాల్యా కేసును పరిశీలిస్తోంది. మరోపక్క మాల్యాను భారత్‌కు తీసుకువచ్చేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.