రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కు  వెనకడుగు పడింది  కానీ సినిమా పరిశ్రమలో ఆయన ఇప్పటికీ పవర్ స్టార్. ఆయనతో సినిమా చెయ్యాలని ఉత్సాహపడుతున్న నిర్మాతలు కోకొల్లలు. ఆయన సై అంటే వరస అడ్వాన్స్ తో ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. అలాంటి క్రేజ్ పవన్ ది. అయితే ఆయన తన దృష్టిని మొత్తం రాజకీయాలపై పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 

సరే సినిమాల్లో నటించనన్నారు కానీ తమ సినిమా టీజర్ రిలీజ్ చేయటం ఒప్పుకుంటారు అని ..'జై సేన'  భావించింది. దానికి తోడు ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీకి మద్ధతుగానే ఉండబోతోందనీ తెలుస్తోంది. టైటిల్‌ లోగోలో బిగించిన పిడికిలి గుర్తు కనిపిస్తోంది. 

సినిమా ప్రమోషన్స్‌ కూడా అలా అనిపించేలాగ చేస్తున్నారు. దాంతో  టీజర్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగానే రిలీజ్‌ చేద్దామనుకున్నారని,కలిసారుట. కానీ కొన్ని కారణాలతో పవన్ నో చెప్పారట. దాంతో గోపీచంద్‌తో ఈ టీజర్‌  ఈ రోజు సాయింత్రం నాలుగు గంటలకు రిలీజ్‌ చేయిస్తున్నారు. జనసేనకు మద్దతుగా సినిమా అంటే, ఈ సినిమాలో ఏం చూపిస్తారా.? అనే ఆసక్తి అప్పుడే అందరిలోనూ నెలకొంది.

సముద్ర మాట్లాడుతూ.. ‘‘పవన్‌కల్యాణ్‌ స్థాపించిన పార్టీ ‘జనసేన’. అది ఆయన రాజకీయ ఆశయాలకు సంబంధించినది. మా సినిమా ‘జై సేన’ ఆయన భావాలకు సంబంధించిన చిత్రం. అయితే ఆయన అభిమానంతో చేసే కొన్ని మంచి పనులను ఇందులో చూపిస్తున్నాం. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందులో కూడా సోషల్‌ కాజ్‌ ఉంటుంది. మాకు మా యూనిట్‌కు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది.  ’’ అన్నారు.

వి. విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో వి. సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.